TTD: క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం... రోజూ ఉచితంగా 50 వేల ఆహార ప్యాకెట్లు!: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- కరోనా సహాయ చర్యల్లో ప్రభుత్వానికి బాసటగా నిలవాలని నిర్ణయం
- మెడికల్ కళాశాలలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు
- స్విమ్స్ నుంచి వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు
కరోనా సహాయక చర్యల్లో ఇకపై టీటీడీ కూడా ప్రభుత్వానికి తోడ్పాటుగా నిలుస్తుందని బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలో కరోనా ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని, తిరుచానూరు పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ వార్డుగా మార్చుతున్నామని తెలిపారు. కరోనా ఆసుపత్రికి అవసరమైన వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను స్విమ్స్ ఆసుపత్రి నుంచి అందిస్తామని వివరించారు.
అంతేకాకుండా లాక్ డౌన్ కాలంలో నిరుపేదల కడుపు నింపేందుకు టీటీడీ తగిన చర్యలు తీసుకుంటోందని, రోజుకు 50 వేల ఆహార పొట్లాలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇవాళ 20 వేల ప్యాకెట్లు వితరణ చేశామని వెల్లడించారు. రేపటి నుంచి పూర్తిస్థాయిలో 50 వేల ఆహార ప్యాకెట్లు అందజేస్తామని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.