Tata: కరోనాపై పోరుకు టాటా గ్రూప్ విరాళం రూ.1500 కోట్లు
- రూ.1000 కోట్లు విరాళం ప్రకటించిన టాటా సన్స్
- రూ.500 కోట్లు అందించాలని టాటా ట్రస్ట్ నిర్ణయం
- అత్యవసర చర్యలు తప్పవన్న రతన్ టాటా
ప్రపంచ దేశాలకు ప్రబల శత్రువుగా పరిణమించిన కరోనా వైరస్ భూతంపై ప్రభుత్వాలు అవిశ్రాంతంగా పోరాడుతున్నాయి. భారత్ లోనూ కరోనాపై తీవ్రస్థాయిలో పోరు సాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి టాటా గ్రూప్ రూ.1500 కోట్ల భారీ విరాళం అందించాలని నిర్ణయించింది. టాటా సన్స్ రూ.1000 కోట్లు, టాటా ట్రస్ట్ రూ.500 కోట్లు కరోనా నివారణ చర్యలకు విరాళంగా ప్రకటించాయి.
దీనిపై రతన్ టాటా మాట్లాడుతూ, కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అత్యవసర చర్యలు అవసరమని అన్నారు. కరోనా వైరస్ మానవాళికి ఎదురైన అత్యంత క్లిష్టమైన సవాల్ అని అభివర్ణించారు. కాగా, ఈ టాటా గ్రూప్ విరాళాన్ని వైద్యసిబ్బందికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు, వెంటిలేటర్ల కొనుగోలుకు, టెస్టింగ్ కిట్ల కొనుగోలుకు, వైద్యసదుపాయాల విస్తరణకు ఉపయోగించనున్నారు.