Chandrababu: దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుంది: చంద్రబాబు
- టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- కరోనా కనీవినీ ఎరుగని విపత్తు అంటూ వ్యాఖ్యలు
- కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంచుకోవాలంటూ ప్రభుత్వానికి సూచన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశకు చేరుకుందని అన్నారు. మొదట్లో విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితులయ్యారని, ఇప్పుడు వారి నుంచి ఇతరులకు కూడా సోకుతోందని వివరించారు. కరోనా వైరస్ కనీవినీ ఎరుగని విపత్తు అని, కరోనాను ఎవరూ తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు.
ఇతర దేశాల్లో కరోనా కట్టడికి సత్ఫలితాలను ఇచ్చిన విధానాలపై అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్పష్టం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకుని ఉంటే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన చేతివృత్తుల వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.