Wines: నేటి నుంచి మద్యం షాపులు తెరుస్తున్నారని పుకార్లు ... అసలు నిజమిది!
- వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్
- మందు దొరకక పిచ్చిగా ప్రవర్తిస్తున్న మందుబాబులు
- షాపులు తెరవాలన్న ఉద్దేశం లేదన్న అబ్కారీ శాఖ
- తప్పుడు నోట్ ను వైరల్ చేసిన వారిపై చర్యలు
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో, మందు దొరకక మందుబాబులు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మరీ అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే, ఇందూరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో కొందరిని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి వైన్స్ ఓపెన్ చేయనున్నారని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదనే ప్రచారం నిన్న జోరుగా జరిగింది.
ఈ మేరకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ పేరిట ఒక నకిలీ నోట్ కూడా సర్క్యూలేట్ కాగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ షాపులు తెరవాలని, కానిస్టేబుళ్లను కాపలాగా పెట్టి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, విక్రయాలు సాగించాలని ఈ నోట్ లో ఉంది. షాపుల యజమానులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది కూడా.
కాగా, ఈ నోట్ ను ఆబ్కారీ శాఖ ఖండించింది. అటువంటి ప్రకటన ఏదీ తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఎవరో ఆకతాయిలు పాత నోట్ ను మార్చి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.