Corona Virus: తెలంగాణలో 5 జిల్లాల్లోనే కరోనా... మిగతా జిల్లాలకు సోకకుండా కట్టుదిట్టమైన చర్యలు మొదలు!
- ఇప్పటివరకూ తెలంగాణలో 67 కేసులు
- 61 కేసులు గ్రేటర్ నుంచే
- ఆపై కరీంగనర్, కొత్తగూడెం జిల్లాల్లో కేసులు
- మిగతా ప్రాంతాల్లో నమోదు కాని పాజిటివ్ లు
తెలంగాణలో ఇప్పటివరకూ 67 కరోనా కేసులు నమోదుకాగా, ఒకరు రికవరీ అవగా, ఒకరు మరణించారు. మరో 65 మందికి చికిత్స జరుగుతోంది. ఇక ఈ కేసులన్నీ రాష్ట్రంలోని 5 జిల్లాల నుంచి మాత్రమే వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసున్న వారు, వారి ఇరుగు, పొరుగు వారిలోని వారికి సోకినవే. వీటిల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ లో బయటకు వచ్చినవే 61 కేసులు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో మినహా తెలంగాణలో మరే ప్రాంతంలోనూ ఇంతవరకూ ఒక్క కేసు కూడా బయట పడలేదు.
దీంతో మిగతా జిల్లాలకు వ్యాధిని సోకకుండా చూసే విషయంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉండటం, జన సాంద్రత అధికం కావడం తదితర కారణాలతో వ్యాధి విస్తరణ గ్రేటర్ హైదరాబాద్ లో అధికంగా ఉంది. ఇప్పటికే అధికారులు శంషాబాద్, కోకాపేట తదితర ప్రాంతాల్లోని సుమారు 2,400 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
ఇక ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి క్వారంటైన్ పాటించని వారిని గుర్తించి, రాజేంద్రనగర్ కు తరలించి నిఘా ఉంచారు. ఓ కుటుంబంలోని నలుగురికి వ్యాధి సోకడంతో ఓ గేటెడ్ కమ్యూనిటీని మొత్తం దిగ్బంధించారు. ఆ ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలోకి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు.
కరోనా సోకిన ఐదు జిల్లాలకు, ఇతర ప్రాంతాలకూ సంబంధాలను పూర్తిగా కట్ చేయడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు నమ్ముతున్నారు. ఆ దిశగా చర్యలను వేగవతం చేశారు. 5 జిల్లాల్లోని అనుమానితులను అందరినీ క్వారంటైన్ చేయగలిగితే, ఇక వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో లాక్ డౌన్ ను మరింత తీవ్రం చేస్తే, మిగతా జిల్లాలు క్షేమంగా ఉంటాయని భావిస్తున్నారు.