Lockdown: ఏపీలో కూరగాయలు, నిత్యావసర దుకాణాల వద్ద తగ్గని రద్దీ... కారణం ఇదే!
- జనతా కర్ఫ్యూ తరువాత లాక్ డౌన్ అమలులోకి
- వేలం వెర్రిగా సరకులు కొనేస్తున్న ప్రజలు
- పోలీసుల అత్యుత్సాహమూ కారణమే
ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూను ప్రకటించిన తరువాత, 21వ తేదీ శనివారం నాడు అత్యధికులు మార్కెట్లకు వెళ్లి, తమకు ఒకరోజుకు కావాల్సిన వన్నీ సమకూర్చుకున్నారు. ఆ తరువాత లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి నిత్యమూ కూరగాయల మార్కెట్లు, నిత్యావసర దుకాణాలను నిత్యమూ తెరుస్తూనే ఉన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, వెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. అయితే, ఎక్కడా సామాజిక దూరం కనిపించడం లేదు సరికదా... ప్రజలు ఏదో జరిగిపోతుందన్నట్టుగా వేలం వెర్రిగా మార్కెట్లకుపరుగులు పెడుతున్నారు. అవసరం ఉన్నా, లేకున్నా సరకులు, కూరగాయలు ఇంటికి చేరవేస్తున్నారు.
లాక్ డౌన్ కు ముందు ఇంటి నుంచి ఒకరో, ఇద్దరో వచ్చి వారానికి సరిపడా కూరగాయలు తీసుకెళ్లేవారు. లాక్ డౌన్ ప్రకటించిన తరువాత నిత్యమూ ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు బయటకు వచ్చి ఏదో ఒకటి కొనుక్కుని వెళుతున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. నిత్యావసరాలను రెండు నెలలకు సరిపడా కొంటున్నారని తెలుస్తుండగా, షుగర్, బీపీ వంటి వ్యాధి గ్రస్థులు ఇంట్లో ఉన్నవారు, వారికి అవసరమైన ఔషధాలను పెద్దఎత్తున కొనుక్కుంటున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో రద్దీ ఎంతమాత్రమూ తగ్గడం లేదు.
ఇక ఇదే సమయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసరసరుకులు విక్రయించే దుకాణాలు, కూరగాయల మార్కెట్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టంగా చెబుతుండగా, వాస్తవ పరిస్థితుల్లో అది అమలు కావడం లేదు. ప్రభుత్వ ఆజ్ఞలను పక్కనబెట్టిన పోలీసులు, ఉదయం 9గంటలకే షాపులన్నింటినీ మూసివేయిస్తున్నారు. సీఐలు, ఎస్‌ఐ స్థాయి అధికారులు, తమ సిబ్బందితో వెళ్లి, షాపులు తెరచివున్న వారిపై లాఠీలు ఝుళిపిస్తుండగా, నిత్యావసరాలు, ఉదయం పూట కేవలం మూడు గంటలు మాత్రమే దొరకుతాయన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. రద్దీ తగ్గకపోవడానికి ఇది మరో కారణం.