Hyderabad: యూపీ ఉపాధి కూలీల సైకిల్ ప్రయాణం... బ్రేక్ వేసి కుషాయిగూడలోని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించిన పోలీసులు!
- ఆకలితో అలమటించలేక సొంతూర్లకు బయలుదేరిన 20 మంది
- చక్రీపుర చౌరస్తా వద్ద అడ్డుకున్న కుషాయిగూడ పోలీసులు
- స్థానిక ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలింపు
పొట్టచేత పట్టుకుని పనులు వెతుక్కుంటూ సుదూరంలోని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం పనిలేకుండా పోయింది...తిండి పెట్టే నాథుడు లేడు. సొంతూర్లకు వెళ్లిపోదామంటే అవసరమైన ప్రయాణ సౌకర్యం కానరాదు. దీంతో ఊరుకాని ఊరులో పస్తులతో జీవనం గడపలేక వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూర్లకు సైకిళ్లపై బయలుదేరారు ఆ భవన నిర్మాణ కూలీలు. కానీ వారి ప్రయాణానికి కుషాయిగూడ పోలీసులు మద్యలోనే బ్రేక్ వేశారు.
యూపీకి చెందిన ఇరవై మంది కార్మికులు నాచారంలోని బాబానగర్‌లో నివసిస్తున్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన ఐదు రోజుల్లోనే వారి పరిస్థితి దీనావస్థకు చేరుకుంది. ఇక అక్కడే ఉంటే ఆకలి చావుతప్పేలా లేదని భావించిన వారంతా సైకిళ్లపై సొంతూర్లకు ప్రయాణం మొదలు పెట్టారు. వీరిని చర్లపల్లి డివిజన్ చక్రీపురం చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
తిండి కూడా లేని పరిస్థితుల్లో తామంతా వెళ్లిపోతున్నామని, నాగారం, కీసర ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా జాతీయ రహదారి పైకి చేరుకుని తమ రాష్ట్రానికి వెళ్లిపోతామని చెప్పారు. అయితే అన్ని రాష్ట్రాలు అంతర్ రాష్ట్ర సరిహద్దులు మూసివేశాయని, దారి మధ్యలో ఇబ్బందులు ఎదుర్కొంటారని నచ్చచెప్పి వారిని కుషాయిగూడలోని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ కేంద్రాలలో భోజన ఏర్పాట్లు ఉంటాయని, అందువల్ల అక్కడ ఆశ్రయం పొందాలని సూచించారు.