Noida: కరోనాను వ్యాపింపజేస్తున్న నోయిడా సంస్థ ఉద్యోగులు... పోలీసు కేసు నమోదు!
- బ్రిటన్ లో పర్యటించి వచ్చిన కంపెనీ ఎండీ, ఉద్యోగి
- ఆపై యదేచ్ఛగా సంస్థ కార్యకలాపాలు
- 13 మందికి సోకిన వ్యాధి
బ్రిటన్ పర్యటనకు వెళ్లి వచ్చిన నోయిడాకు చెందిన ఓ కంపెనీ ఎండీ, మరో ఉద్యోగి క్వారంటైన్ లో ఉండకుండా, బయట తిరగడం, వారి కారణంగా కొంతమందికి కరోనా సోకినట్టు అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ మార్చి 1న, ఉద్యోగి 7వ తేదీన ఇండియాకు వచ్చారు. వీరు యదేచ్ఛగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించడంతో నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 13 మందికి వైరస్ సోకినట్టు తేలింది.
వీరిద్దరికీ వైరస్ పాజిటివ్ వచ్చిన తరువాత, పోలీసులకు ఈ విషయం గౌతమ్ బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఏ భార్గవ నుంచి ఫిర్యాదు రూపంలో తెలిసింది. దీంతో 1897 యూపీ ఎపిడెమిక్ డిసీజస్ యాక్ట్ కింద వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
కాగా, గౌతమ్ బుద్ధ నగర్ లో 26 మందికి వైరస్ పాజిటివ్ రాగా, వీరిలో 13 మంది నోయిడా కంపెనీతో ఏదో ఓ రూపంలో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం. క్వారంటైన్ లో ఉండకుండా వీరు బయట తిరగడం వల్లే వ్యాధి వ్యాపించిందని, దీనిపై పూర్తి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు.
కాగా, ఇదే సంస్థకు వచ్చిన విదేశీయులు ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఆడిట్ నిర్వహించగా, ఈ విషయాన్ని సంస్థ వైద్యాధికారులకు తెలియజేయలేదు. ప్రస్తుతం వైరస్ పాజిటివ్ వచ్చిన వారి కుటుంబీకులందరినీ క్వారంటైన్ చేశామని భార్గవ వెల్లడించారు.