Narendra Modi: ఇది జీవన్మరణ పోరాటమే... గెలవడమా? ఓడిపోవడమా? ప్రజలే తేల్చుకోవాలి: నరేంద్ర మోదీ
- కరోనా ఓ ప్రాణాంతక మహమ్మారి
- భయం, ఆందోళన లేకుండా పోరాడదాం
- పలు వర్గాల ప్రజలతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని
ప్రస్తుతం మిగతా ప్రపంచంతో పాటు ఇండియా కూడా ఓ ప్రాణాంతక మహమ్మారితో జీవన్మరణ పోరాటం సాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో నెలవారీ మన్ కీ బాత్ లో భాగంగా ఆయన ప్రసంగించారు. అయితే, ఈ ప్రసంగం మోదీ మాటల్లో కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పేదలు, వ్యాపారవేత్తలు, డాక్టర్లతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. కరోనా విలయతాండవం సృష్టిస్తున్న ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మనో నిబ్బరాన్ని వదలరాదని పిలుపునిచ్చారు.
తాను సూచించినట్టుగా 15వ తేదీ వరకూ ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను పాటించాలని, ఏ పేదకూ అన్న పానీయాలకు లోటు రానివ్వకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని భరోసాను ఇచ్చారు. ఓ వ్యక్తి ఫోన్ చేసి, తమ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, దీంతో తామంతా తీవ్ర ఆందోళనలో ఉన్నామని చెప్పగా, ఎటువంటి భయాలూ పెట్టుకోవద్దని, ఎవరికైనా జలుబు, జ్వరం, ఊపిరి ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే, వైద్యాధికారులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ఓ వైద్యుడు ఫోన్ చేసి, నిత్యమూ కరోనా కేసులతో ఊపిరి సలపడం లేదని, తామంతా ఒత్తిడిలో కూరుకుపోతున్నామని వ్యాఖ్యానించగా, మోదీ, ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యుల సేవలను జాతి ఎన్నటికీ మరచిపోబోదని అన్నారు. ఎంత విధి నిర్వహణలో ఉన్నా, కుటుంబానికి కూడా కొంత సమయం కేటాయించాలని, స్వీయ ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టాలని సూచించారు.
రోజువారీ కూలీలు, పేదలు పడుతున్న బాధలను ఆ స్థాయి నుంచే వచ్చిన తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకునేందుకేనని తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటిస్తే, సాధ్యమైనంత త్వరలోనే పరిస్థితి సద్దుమణుగుతుందని, సాధారణ స్థితి వస్తుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓ మహమ్మారితో చేస్తున్న ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరూ సైనికులేనని, గెలవడమా? ఓడిపోవడమా? అన్నది సైన్యం చేతిలోనే ఉందని, ధైర్యంగా పోరాటం సాగిద్దామని అన్నారు.