Thomas Schaefer: జర్మనీలో కరోనా ఒత్తిడి తట్టుకోలేక మంత్రి ఆత్మహత్య
- హెస్సే రాష్ట్ర ఆర్థికమంత్రి థామస్ షాఫర్ బలవన్మరణం
- ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఆత్మహత్య
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హెస్సే రాష్ట్ర ముఖ్యమంత్రి
కరోనా వైరస్ మహమ్మారి నేరుగా ప్రాణాలు తీయడమే కాదు, పరోక్షంగా ఆత్మహత్యకు కూడా కారణమైన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. హెస్సే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఆర్థికశాఖ మంత్రి థామస్ షాఫర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 54 ఏళ్ల షాఫర్ మృతదేహం ఫ్రాంక్ ఫర్ట్ లోని ఓ రైల్వే ట్రాక్ వద్ద పడివుండగా గుర్తించారు.
హెస్సే రాష్ట్ర ప్రీమియర్ వోల్కెర్ బౌఫీర్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నామని, ఇది తమను తీవ్ర విషాదానికి గురిచేసిందని బౌఫీర్ తెలిపారు. హెస్సే రాష్ట్రం జర్మనీ దేశ ఆర్థిక కార్యకలాపాలకు గుండెకాయలాంటిది. హెస్సే ముఖ్యనగరం ఫ్రాంక్ ఫర్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాంకులకు పుట్టినిల్లు. కరోనా వైరస్ ప్రభావంతో ఇక్కడి ఆర్థిక రంగ కార్యకలాపాలు బాగా కుంటుపడ్డాయి.