Lockdown: పేద, వలస కార్మికుల నుంచి నెల రోజుల పాటు అద్దె వసూలు చేయద్దు!: ఇళ్ల యజమానులకు కేంద్రం ఆదేశాలు
- పలు ప్రాంతాల్లో పేదల కోసం షెల్టర్లు
- అన్న పానీయాలకు లోటు లేకుండా చూస్తున్నాం
- స్వస్థలాలకు వెళితే క్వారంటైన్ తప్పనిసరి
- కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు
పేద, వలస కార్మికుల నుంచి నెల రోజుల పాటు అద్దెను వసూలు చేయరాదని ఆయా ఇళ్ల యజమానులను కేంద్రం ఆదేశించింది. ఇదే సమయంలో కంపెనీల యాజమాన్యాలు, ఉద్యోగులకు ఏ విధమైన కోత లేకుండా వేతనాలు చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ మేరకు ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు హోమ్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కాగా, దేశంలోని కంపెనీలు మూతపడటంతో వేలాది మంది పనులులేక పస్తులుంటున్నారు. వీరిలో ఎంతో మంది తమ స్వస్థలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుండగా, పలు ప్రాంతాల్లో షెల్టర్లను ఏర్పాటు చేసి వారికి అన్న పానీయాలను ఏర్పాటు చేశారు. వలస కార్మికుల్లో కొంతమంది స్వస్థలాలకు చేరుకోగా, వారు తమకు సమీపంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో 14 రోజులు ఉండాల్సిందేనని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేశామని, ఇక్కడికి వచ్చేవారికి ఆహారాన్ని అందిస్తామని, వారి వారి ప్రాంతాల్లో ఉండలేని వారు ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందవచ్చని హోమ్ మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్ డౌన్ ను ప్రకటించాల్సి వచ్చిందని, వందలాది కిలోమీటర్లు కాలినడకన వెళ్లే వారు రెండు వారాల పాటు ఎవరినీ కలవరాదని, ఇందుకు సహకరించాలని పేర్కొంది. కాగా, ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు కాలినడకన బయలుదేరిన వారిని గమ్య స్థానాలకు చేర్చేందుకు యూపీ ప్రభుత్వం 1000 బస్సులను, ఢిల్లీ ప్రభుత్వం 200 బస్సులను ఏర్పాటు చేశాయి.
ఈ ప్రకటన వెలువడగానే వేలాది మంది ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారి మధ్య సోషల్ డిస్టెన్సింగ్ లేకపోవడంతో అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆపై అందరినీ బస్సులు ఎక్కించి, యూపీలోని వివిధ ప్రాంతాల్లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. 14 రోజుల తరువాత వీరిలో కరోనా లక్షణాలు లేకుంటే, వారివారి గ్రామాలకు తరలిస్తామని తెలిపారు.