MS Dhoni: క్రికెట్‌తో ధోనీ రూ. 30 లక్షలు సంపాదిస్తే చాలనుకున్నాడట!
- దానితో మిగిలిన జీవితం రాంచీలో గడపొచ్చన్నాడు
- కెరీర్ ఆరంభంలో ఈ మాట చెప్పాడన్న వసీం జాఫర్
- ఐపీఎల్ వాయిదాతో ప్రశ్నార్థకంగా ధోనీ భవితవ్యం!
భారత జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్థానం విభిన్నం. మారుమూల రాంచీ నుంచి జట్టులోకి వచ్చి.. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిన ధోనీ జీవితం ఎంతో మందికి స్పూర్తి దాయకం. ఆటలోనే కాదు ఆర్జనలోనూ అతను ఓ మెట్టు పైనే ఉన్నాడు.
ఒకప్పుడు రైల్వే టీసీగా పని చేసిన ధోనీ సొంతంగా చార్టర్ ఫ్లయిట్ కొనుక్కునే స్థాయికి ఎదిగాడు. అతను కనుసైగ చేస్తే చాలు కోట్ల రూపాయలు చెల్లించి తమ ప్రచారకర్తగా నియమించుకునేందుకు వివిధ బ్రాండ్లు పోటీ పడతాయి. అలాంటి ధోనీ తన కెరీర్ తొలినాళ్లలో మాత్రం ముప్పై లక్షల రూపాయలు సంపాదిస్తే చాలనుకున్నాడట. ఈ విషయాన్ని ధోనీతో కలిసి ఆడిన మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తెలిపాడు.
ధోనీతో మీకున్న ఏదైనా మంచి జ్ఞాపకాన్నిచెప్పమని ట్విట్టర్లో ఓ అభిమాని జాఫర్ ను అడిగాడు. దీనికి ‘క్రికెట్ ఆడి రూ. 30 లక్షలు సంపాదించి ఆ తర్వాత మిగిలిన జీవితాన్ని రాంచీలో ప్రశాంతంగా గడపాలి’ అని భారత జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లలో ధోనీ ఓ సారి తనతో చెప్పాడని జాఫర్ వెల్లడించాడు.
ఇక గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత ధోనీ ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌తో తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు కొన్ని రోజుల క్రితం చెన్నైలో అతను ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. కానీ, కరోనా దెబ్బకు ఐపీఎల్ వాయిదా పడగా.. చెన్నై జట్టు తమ ప్రాక్టీస్‌ను కూడా రద్దు చేసుకుంది. దాంతో, ధోనీ తిరిగి తన సొంత పట్టణం రాంచీకి చేరుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ రద్దవుతుందన్న వార్తల నేపథ్యంలో ధోనీ ఆట చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురవనుంది. అలాగే, ఐపీఎల్ ఆడి తిరిగి భారత జట్టులోకి రావాలనుకున్న మహీ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.