Manila: కరోనా ఔషధాలతో జపాన్ వెళుతూ కుప్పకూలిన విమానం... ఎనిమిది మంది మృతి!
- మనీలా నుంచి హనెడా బయలుదేరిన ఫ్లయిట్
- టేకాఫ్ అవుతూనే కూలిపోయి మంటల్లో
- విమానంలోని అందరూ మృతి
కరోనా వైరస్ బాధితులకు అవసరమైన ఔషధాలు, మెడికల్ ఎక్విప్ మెంట్ తో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా నుంచి జపాన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అవుతూనే కుప్పకూలగా, విమానంలోని 8 మంది మరణించారు. టేకాఫ్ సమయంలోనే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి, రన్ వేపైనే విమానం కూలి మంటలు చెలరేగాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించినా, ఒక్కరి ప్రాణాలు కూడా కాపాడలేకపోయారు.
గత మూడు వారాలుగా జపాన్ లో కరోనా వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో వైద్య పరికరాలతో ఈ విమానం హనెడాకు బయలుదేరింది. రన్ వేపైనే విమానం కాలిపోవడంతో, మనీలా నుంచి బయలుదేరాల్సిన ఇతర విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ విమానం ప్రభుత్వానిది కాదని, లయన్ ఎయిర్ అనే చార్టెడ్ కంపెనీదని అధికారులు వెల్లడించారు. జరిగిన ప్రమాదంపై విచారణ జరిపిస్తున్నట్టు పేర్కొన్నారు. విమాన ప్రమాదంపై జపాన్, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.