Guntur: చిల్లర దొంగల చేతివాటం...ఆలయాల హుండీలపై కన్ను
- ఆలయాల మూసివేతతో నగదు అపహరణ
- గుంటూరు జిల్లాలో రెండు సంఘటనలు
- మూడు రోజుల వ్యవధిలో రెండు చోట్ల దొంగతనం
‘సందట్లో సడేమియా’ అంటే ఇదేమరి. లాక్‌డౌన్ కారణంగా దేశం మొత్తం షట్‌డౌన్ అయింది. జనజీవనం దాదాపుగా స్తంభించిపోయింది. ఎక్కడివారు అక్కడే ఇళ్లకు పరిమితం కావడంతో బయట తిరిగే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. గుడులు, గోపురాలు, మందిరాల సందర్శనపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఉదయం, సాయంత్రం సేవా కార్యక్రమాల్లో మినహా మిగిలిన సమయాల్లో ఆలయాలు, మందిరాలకు తాళాలు వేసి అర్చకులు ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఇదే అదనుగా చిల్లర దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గుడుల్లో హుండీల చోరీకి పాల్పడుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో గుంటూరు జిల్లాలో ఇటువంటివి రెండు చోరీలు వెలుగు చూడడంతో పోలీసులు అలర్టయ్యారు. గుంటూరు నగరం ఏటీ అగ్రహారం రెండవ లైన్‌లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో నిన్నరాత్రి చోరీ జరిగింది.
దుండగులు గడ్డపలుగుతో దేవాలయం హుండీ పగులగొట్టి అందులో ఉన్న నగదు అపహరించారు. మూడు రోజుల క్రితం తెనాలి మండలం బుర్రిపాలెంలో ఇద్దరు యువకులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఆలయాల హుండీలపై నిర్వాహకులు ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.