Omar Abdullah: దేశం చేస్తున్న యుద్ధానికి మరింత శక్తిని చేకూర్చారు: ఒమర్ అబ్దుల్లాపై మోదీ ప్రశంస

Narendra Modi praises Omar Abdullah
  • ఒమర్ అబ్దుల్లా మామయ్య కన్నుమూత
  • ఇంటి వద్ద, శ్మశానవాటిక వద్ద గుమికూడ వద్దని పిలుపు
  • మీ పిలుపు ప్రశంసనీయమన్న మోదీ
నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మామయ్య (ఫరూఖ్ అబ్దుల్లాకు బావగారు) మహ్మద్ అలీ మట్టూ అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉందని... మామయ్య చనిపోయిన సందర్భంగా ఆయన ఇంటి ముందు కానీ, శ్మశానవాటిక వద్ద కానీ అధిక సంఖ్యలో గుమికూడవద్దని అభిమానులను కోరారు. మీ ఇంటి నుంచే ప్రార్థనలు చేయాలని... అవి ఫలిస్తాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పారు.

ఒమర్ అబ్దుల్లా నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. 'ఒమర్ అబ్దుల్లా మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా. మీ మామయ్య ఆత్మకు శాంతి చేకూరాలి. ఇలాంటి విషాదకర సమయంలో కూడా అధిక సంఖ్యలో గుమికూడొద్దని ప్రజలకు మీరిచ్చిన పిలుపు ప్రశంసనీయం. కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న యుద్ధానికి మీరు మరింత శక్తిని చేకూర్చారు' అని ట్వీట్ చేశారు.

మోదీ ట్వీట్ కు ఒమర్ అబ్దుల్లా ప్రతిస్పందించారు. సంతాప సందేశాన్ని పంపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మామయ్య ఆత్మశాంతి కోసం మీరు చేసిన ప్రార్థన ప్రశంసించతగ్గదని అన్నారు.
Omar Abdullah
Narendra Modi
BJP
National Conference

More Telugu News