Constable: డ్యూటీలో చేరడానికి 450 కిలోమీటర్లు నడిచిన పోలీసు!
- ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ కు ప్రయాణం
- ఒక రోజంతా ఆహారం కూడా తినని వైనం
- ప్రయాణం కారణంగా గాయపడ్డ పాదాలు
కరోనాను కట్టడి చేయడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం సానుకూల ఫలితాలను ఇస్తోంది. ఇదే సమయంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. తమ గ్రామాలకు వెళ్లేందుకు జనాలు వందలాది కిలోమీటర్లు నడుస్తూ వెళ్తున్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన దిగ్విజయ్ శర్మ (22) అనే పోలీస్ కానిస్టేబుల్ మధ్యప్రదేశ్ లో విధులను నిర్వహిస్తున్నాడు. విధుల్లో చేరడానికి ఏకంగా 450 కిలోమీటర్లు ఆయన నడిచాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను పని చేస్తున్న పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ తో తాను ఫోన్ లో మాట్లాడానని... ఈ క్లిష్ట సమయంలో తాను విధులను నిర్వహించాలనుకుంటున్నానని చెప్పానని వెల్లడించాడు. రవాణా సదుపాయాలు లేని కారణంగా... తనను ఇంటి వద్దే ఉండాలని సార్ చెప్పారని... అయినా తాను బయల్దేరానని చెప్పాడు. మార్చ్ 25 ఉదయం ఇంటి నుంచి నడుస్తూ తాను బయల్దేరానని... మధ్యలో మోటార్ బైక్ లపై లిఫ్ట్ అడుగుతూ ప్రయాణించానని తెలిపాడు. ఒక రోజంతా ఆహారం లేకుండానే ప్రయాణించానని... ఒక స్వచ్ఛంద సంస్థ తనకు ఆహారం పెట్టిందని చెప్పాడు.
ప్రయాణం కారణంగా తన పాదాలు కందిపోయాయని... తనను రెస్ట్ తీసుకోమని ఇన్స్ పెక్టర్ చెప్పారని... త్వరలోనే విధుల్లో చేరుతానని తెలిపాడు. 2018 జూన్ 1న మధ్యప్రదేశ్ పోలీసు విభాగంలో ఆయన చేరాడు.