Kannababu: కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులను కూడా వినియోగిస్తాం: కన్నబాబు

AP Minister Kannababu tells about government plans

  • లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందన్న కన్నబాబు
  • వైద్యపరమైన అంశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడి
  • ఇళ్లలో సదుపాయాలు లేకపోతే క్వారంటైన్ కేంద్రాలకు రావొచ్చని సూచన

రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారని తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాల్సి ఉందని, వైద్య పరమైన అంశాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఇకపై కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులను కూడా వినియోగిస్తామని చెప్పారు. విశాఖ, విజయవాడ, కాకినాడ, తిరుపతిలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రులను కూడా కరోనా చికిత్స కోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు.

ముందు జాగ్రత్తగా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్యను పెంచుతున్నామని, క్వారంటైన్ కేంద్రాల్లో పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు వివరించారు. ఇళ్లలో సదుపాయాలు లేకపోతే క్వారంటైన్ కేంద్రాలకు రావొచ్చని కన్నబాబు సూచించారు.

అటు, కరోనా లాక్ డౌన్ కారణంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం సూచించారని వెల్లడించారు. ప్రాసెసింగ్ యూనిట్లలో వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించేలా చూడాల్సి ఉందని స్పష్టం చేశారు. పండ్ల రవాణా విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ప్రస్తుతం రబీ పంట చేతికి వచ్చే సమయం అని, మిల్లర్లు రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News