Reliance: పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్ల విరాళం ప్రకటించిన రిలయన్స్

Reliance Industries pledges five hundred crores to PM Cares Fund

  • ప్రధాని పిలుపుకు స్పందించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
  • మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు కూడా విరాళం
  • ఇప్పటికే కరోనా సహాయక చర్యలు చేపడుతున్న రిలయన్స్

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందనగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడిక్కడ పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది.
 
ప్రధానమంత్రి నిధికి ఆర్థికపరమైన విరాళానికి అదనంగా కంపెనీ కోవిడ్ -19పై మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ రెండు రాష్ట్రాలకు ఒక్కో దానికి రూ.5 కోట్ల విరాళాన్ని కూడా అందించింది. కరోనా వైరస్ మహమ్మారి విసిరిన ఊహించని సవాలును ఎదుర్కొని గెలిచేందుకు గాను దేశంలో రిల్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్)   24x7 బహుముఖ, క్షేత్రస్థాయి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రజలంతా సన్నద్ధంగా ఉండేందుకు, ఆహార సరఫరాలు పొందేందుకు, సురక్షితంగా, అనుసంధానితమై ఉండేలా చేస్తూ స్ఫూర్తిని అందించేలా చేస్తోంది.

కోవిడ్ -19పై చేపట్టిన ఈ కార్యాచరణ ప్రణాళిక అమలులో రిల్ ఇప్పటికే రిలయన్స్ కుటుంబం యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగిస్తోంది. రిల్ మరియు దాని బృందాలు ఇప్పటికే వివిధ నగరాలు, గ్రామాల్లోకి చేరుకున్నా యి. ఆసుపత్రులు, కిరాణా, రిటైల్ స్టోర్స్ లో తమ సేవలను అందిస్తున్నాయి. దేశ సేవలో అదనపు శక్తి సామర్థ్యాలను కంపెనీ వినియోగిస్తోంది.
 
రిలయన్స్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ ఈ విషయంలో గణనీయ కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా పలు కార్యక్రమాలను చేపట్టాయి.
  • పీఎం-కేర్స్ నిధికి రూ.500 కోట్ల విరాళం
  • మహారాష్ట్ర సీఎం నిధికి రూ.5 కోట్ల విరాళం
  • గుజరాత్ సీఎం నిధికి రూ.5 కోట్ల విరాళం
  • భారతదేశ మొట్టమొదటి 100 పడకల ఎక్స్ క్లూజివ్ కోవిడ్ హాస్పిటల్ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. మరో రెండు వారాల్లో ఇది కోవిడ్ రోగులకు తన సేవలను అందించనుంది.
  • దేశవ్యాప్తంగా రానున్న 10 రోజుల్లో యాభై లక్షల ఉచిత భోజనాలు. కొత్త ప్రాంతాల్లో మరిన్ని మీల్స్ అందించేందుకు ప్రయత్నాలు
  • పారిశుద్ధ్య కార్మికులు మరియు సంరక్షకులకు రోజుకు 1  లక్ష మాస్క్ ల పంపిణి
  • ఆరోగ్య సిబ్బంది మరియు సంరక్షకులకు రోజూ వేలాది పీపీఈలు
  • ప్రకటించబడిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలకు ఉచిత ఇంధనం
  • 40 కోట్ల మంది వ్యక్తులను, వేలాది సంస్థలను జియో  తిరుగులేని విధంగా అనుసంధానం చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్, హెల్త్ ఫ్రమ్ హోమ్ వంటి కార్యక్రమాలకు అండగా నిలిచింది. దేశం ముందుకెళ్లేందుకు తోడ్పడింది.
  • స్టోర్స్ మరియ హోమ్ డెలివరీల ద్వారా రిలయన్స్ రిటైల్ రోజు కోట్లాది మంది భారతీయులకు నిత్యావసర వస్తువులను అందిస్తోంది.
 
సమయానుగుణంగా తగినంత ఆర్థిక విరాళాన్ని అదించడంతో పాటుగా వివిధ కార్యక్రమాల ద్వారా దేశం పట్ల  రిల్ తన అంకితభావాన్ని చాటుకుంటోంది. కంపెనీ మరియు దాని సిబ్బంది రోజూ దేశసేవలో నిమగ్నమయ్యారు. కరోనా నుంచి కాపాడడంలో ముందు వరుసలో ఉన్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సంరక్షకులు, అధికారులు, పోలీసు అధికారులకు, రవాణా మరియు నిత్యావసర వస్తువులు అందించే వారికి సహకరిస్తున్నారు. అంతేగాకుండా ఇళ్లలోనే ఉంటూ కరోనాపై పోరాటానికి మద్దతుగా ఉంటున్న కోట్లాది మంది భారతీయులకు అండగా నిలుస్తున్నారు. వైరస్ పై జరుగుతున్న పోరాటంలో మొదటి వరుసలో నిల్చిన వైద్యులు లాంటి వారికి అండగా రెండో వరుసలో రిల్ సిబ్బంది తమ సేవలను అందిస్తున్నారు.

ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ మాట్లాడుతూ, ‘‘భారతదేశం అతి త్వరలోనే కరోనా వైరస్ పై విజయం సాధించగలదని మేము విశ్వసిస్తున్నాం. యావత్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిబ్బంది అంతా కూడా ఈ సంక్షోభ సమయంలో దేశానికి అండగా నిలుస్తారు. కోవిడ్ -19పై జరుగుతున్న యుద్ధంలో గెలిచేందుకు తాము చేయగలిగిందంతా చేస్తారు’’ అన్నారు.
 
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ నీతా అంబానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోవిడ్ -19 మహమ్మారిపై పోరాటానికి దేశం అంతా ఒక్కటైన సందర్భంలో రిలయన్స్ ఫౌండేషన్ లో మేమంతా కూడా దేశప్రజానీకానికి అండగా నిలుస్తున్నాం. మరీ ముఖ్యంగా కరోనాపై పోరాటంలో ముందువరుసలో నిల్చిన వారికి మద్దతుగా ఉంటాం. భారతదేశ మొట్టమొదటి కోవిడ్ హాస్పిటల్ ను నెలకొల్పడంలో మన వైద్యు లు, సిబ్బంది ఎంతగానో అండగా నిలిచారు. కోవిడ్ -19 కు సంబంధించి విస్తృత స్థాయిలో స్క్రీనింగ్, టెస్టింగ్, నిరోధం మరియు చికిత్సలలో ఇది ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది’’ అని అన్నారు. ‘‘అణగారిన వర్గాలు మరియు రోజువారీ కూలీలు లాంటి వారిని ఆదుకోవాల్సిన సందర్భం ఇది. మా భోజన పంపిణీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఆహారం అందించాలన్నది మా లక్ష్యం’’ అని నీతా అంబానీ అన్నారు.

  • Loading...

More Telugu News