Petrol: పాతాళానికి చమురు ధరలు.. అయినా వినియోగదారులకు ప్రయోజనం నిల్!
- అంతర్జాతీయంగా 18 ఏళ్ల కనిష్ఠానికి చమురు ధరలు
- 2002 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి
- ప్రయోజనాల్ని ఎక్సైజ్ సుంకంతో సర్దుబాటు చేస్తున్న కేంద్రం
కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అనిశ్చితిలోకి వెళ్లిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. 2002 తర్వాత ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ దేశీయ వినియోగదారులకు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదు. కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకం చెల్లింపులకు, చమురు ధరలు తగ్గడం ద్వారా సమకూరే ప్రయోజనంతో కంపెనీలు సర్దుబాటు చేస్తుండడమే ఇందుకు కారణం. ఫలితంగా దేశీయ పెట్రో ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
ఈ నెల 16న దేశీయ కంపెనీలు చమురు ధరలను చివరిసారి సవరించాయి. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.69.59గా ఉండగా, డీజిల్ ధర రూ. 62.29గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోలును రూ. 75.30కు, డీజిల్‌ను రూ.65.21కి విక్రయిస్తున్నారు. కాగా, ఇటీవల పెట్రోలు, డీజిల్‌పై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఫలితంగా ఈ రెండింటి ధరలు లీటరుకు రూ. 3 వరకు పెరగాల్సి ఉంది. అయితే, ఆయిల్ కంపెనీలు మాత్రం చమురు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని ఎక్సైజ్ సుంకానికి సర్దుబాటు చేస్తూ వస్తుండడంతో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.