Corona Virus: యువతకు కరోనా రాదన్న ధీమా వద్దు.. ఆందోళన నింపుతున్న అధ్యయనం!
- కరోనా వైరస్‌కు వయసు తారతమ్యం లేదు
- భ్రమల నుంచి యువత బయటకు రావాలన్న డబ్ల్యూహెచ్‌వో
- సీడీసీ జరిపిన అధ్యయనంలో బయటపడిన మరిన్ని వాస్తవాలు
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ బారినపడి ఎక్కువగా మరణిస్తున్నది 60 ఏళ్లు పైబడినవారే. దీంతో ఈ వైరస్ ఆ లోపు వారికి, ముఖ్యంగా యువతను దరిచేరదన్న ధీమా చాలామందిలో ఉంది. అయితే, ఇకపై అలాంటి భ్రమలు వదులుకోవాల్సిందేనని, వైరస్‌కు వయసు భేదం లేదని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ కూడా ఇలాంటి హెచ్చరికే చేశారు. ఈ వైరస్ తమనేమీ చేయదన్న భ్రమల నుంచి యువత బయటకు రావాలని, దీనికి ఎవరూ అతీతులు కారని పేర్కొన్నారు.
తాజాగా, అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) జరిపిన అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికాలో కరోనా సోకిన 500 మందిపై జరిపిన అధ్యయనానికి సంబంధించిన విషయాలను తాజాగా విడుదల చేసిన సీడీసీ.. కరోనాతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో 12 శాతం మంది 20 నుంచి 44 ఏళ్ల వయసు వారేనని పేర్కొంది.
45 నుంచి 54 ఏళ్ల మధ్య 30 శాతం మంది, 55 నుంచి 64 ఏళ్ల లోపు వారు 36 శాతం మంది ఉన్నట్టు తెలిపింది. 19 ఏళ్ల లోపు వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉందని అధ్యయన నివేదిక పేర్కొంది. అయితే, మరణించిన వారిలో మాత్రం 80 శాతం మంది 65 ఏళ్లు పైబడినవారే ఉన్నారని తెలిపింది. కాబట్టి యువత కూడా అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని, అదొక్కటే ఈ వైరస్‌ను దూరం పెడుతుందని సర్వే పేర్కొంది.