Andaman: అండమాన్‌కూ తాకిన మర్కజ్ సెగ.. 9 మందికి కరోనా
- అండమాన్‌లో 10కి పెరిగిన కేసులు
- వేర్వేరు విమానాల ద్వారా అండమాన్ చేరుకున్న 9 మంది
- కేజ్రీవాల్ ప్రభుత్వం సీరియస్.. మౌలానాపై కేసు నమోదు
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న తబ్లిగి జమాత్ కేంద్రం (మర్కజ్)లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లివచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఇదే కార్యక్రమానికి ఏపీ నుంచి దాదాపు 500 మంది హాజరైనట్టు తెలుస్తుండగా, వీరిలో ఐదుగురిలో ఇప్పటికే కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
తాజాగా, మర్కజ్ వెళ్లి వచ్చిన 9 మంది అండమాన్ వాసుల్లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అండమాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 10కి చేరుకుంది. వీరంతా వేర్వేరు విమానాల్లో ఢిల్లీ నుంచి ఈ నెల 24న అండమాన్ చేరుకున్నారు. విచారణ సందర్భంగా తాము మర్కజ్‌కు వెళ్లినట్టు తెలిపారు.
కరోనా వైరస్‌కు అడ్డుకట్టే వేసే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంటే మర్కజ్ ఇలా సామాజిక దూరం నిబంధనను పక్కన పెట్టేసి కార్యక్రమం నిర్వహించడాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ మర్కజ్ కేంద్రం నుంచి 34 మందిని పరీక్షల నిమిత్తం నగరంలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వీరందరిలోనూ కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది.