KDCC: డబ్బులు కావాలంటే ఫోన్ చేస్తే చాలు... వీధిలోకి కేడీసీసీ బ్యాంకు ఏటీఎం!
- కేడీసీసీ బ్యాంకు వినూత్న ఆఫర్
- మొబైల్ ఏటీఎంలను పంపిస్తాం
- వెల్లడించిన చైర్మన్ యార్లగడ్డ
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతూ, ప్రజలంతా ఇంటికే పరిమితమైన వేళ, బ్యాంకులో డబ్బులున్నా, చేతిలో డబ్బుల్లేకుండా ఇబ్బందులు పడుతున్న వారి కోసం కేడీసీసీ బ్యాంకు (కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు వెళ్లలేక, సొమ్మును విత్ డ్రా చేయలేకపోతున్న వారి సౌలభ్యం కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసి, వాటిని ప్రజల వద్దకే పంపుతున్నట్టు బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
డబ్బులు అవసరం అయిన వారు ఆయా గ్రామాల్లోని సహకార సంఘం కార్యదర్శికి సమాచారం ఇస్తే, ఆ వెంటనే ఆయా వీధుల్లోకి మొబైల్ ఏటీఎంలను పంపిస్తామని చెప్పారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362 నంబర్ కు ఫోన్ చేయాలని వెంకట్రావు సూచించారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.