Assam Doctor: హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు వాడి ప్రాణాలు కోల్పోయిన గువహటి డాక్టర్
- ఎక్కువ డోసులో మందు వాడిన డాక్టర్ బర్మన్
- హార్ట్ అటాక్ కు గురై ప్రాణాలు కోల్పోయిన వైనం
- సీనియర్ అనస్థటిస్ట్ గా పని చేస్తున్న బర్మన్
కరోనా మహమ్మారికి ఇంత వరకు ఎలాంటి వాక్సిన్ కానీ, మందు కానీ లేదనే విషయం అందరికీ తెలిసిందే. రోగి లక్షణాలను బట్టి దీనికి తగిన విధంగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొన్ని చోట్ల దీని కోసం మలేరియా నివారణకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ మందు తీసుకుని ఓ వైద్యుడు ప్రాణాలను కోల్పోయిన ఘటన అసోంలోని గువహటిలో చోటుచేసుకుంది.
ఎక్కువ డోసులో ఈ మందును వాడటంతో 44 ఏళ్ల వైద్యుడు ఉత్పల్జిత్ బర్మన్ హార్ట్ అటాక్ కు గురై ప్రాణాలు కోల్పోయారు. సీనియర్ అనస్థటిస్ట్ అయిన బర్మన్ సొంతంగానే ఈ మందును వినియోగించారు. అయితే, ఈ డ్రగ్ ను తీసుకోవడం వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయారా? అనే విషయంలో సందేహం నెలకొంది.
మరోవైపు, డ్రగ్ తీసుకున్న తర్వాత తాను తీవ్ర ఇబ్బందికి గురవుతున్నానంటూ తన సహోద్యోగికి ఆయన వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. డాక్టర్ బర్మన్ కరోనా బాధితుడు కాదనే విషయం గమనార్హం. అయితే, వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఈ డ్రగ్ ను వినియోగించినట్టు తెలుస్తోంది.