AmaraRaja Group: ఏపీకి రూ. 5 కోట్లు, తెలంగాణకు రూ. 1 కోటి విరాళమిచ్చిన అమర రాజ గ్రూప్
- కరోనా నివారణకు ప్రభుత్వం చర్యలు
- తమవంతు సాయంగా రూ. 6 కోట్లు
- గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో సీఎస్ఆర్ కార్యక్రమాలు
- మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సంస్థ వెల్లడి
కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతునిస్తూ, అమర రాజా గ్రూప్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 5 కోట్లు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలను మరియు ఉద్యోగుల ఒక రోజు జీతాన్ని విరాళంగా అందించింది. ఇదే సమయంలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో కొవిడ్ - 19తో పోరాడటానికి అమరా రాజా గ్రూప్ వైస్ చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ. 2.50 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారని సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా అమర రాజ గ్రూప్, రాజన్న ట్రస్ట్ చిత్తూరు, గుంటూరులలో కరోనాతో పోరాడటానికి వైద్య అవసరాలకు చేయూతనిస్తూనే ఉందని, వైరస్ నియంత్రణ, నివారణకు ప్రజారోగ్యం, అవసరమైన సామగ్రిపై దృష్టి పెట్టడానికి కృషి చేస్తున్నామని పేర్కొంది. ఇటీవలే తమ సంస్థ చిత్తూరు జిల్లా కలెక్టర్ సమక్షంలో రూ. 5 లక్షల విలువైన మాస్క్ లు, చేతి తొడుగులు మరియు శానిటైజర్లు విరాళంగా ఇచ్చిందని, ఈ కార్యక్రమాల్లో అమర రాజ గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామచంద్ర ఎన్ గల్లాతో పాటు సంస్థ ఇన్ ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి గౌరినేని, గల్లా విజయ్ నాయుడు తదితరులు పాల్గొన్నారని పేర్కొంది.