Zoom App: లాక్ డౌన్ ప్రభావం... డౌన్ లోడ్స్ లో వాట్సాప్, టిక్ టాక్ లను దాటేసిన యాప్ ఇదే!

Zoom app records most downloads than WhatsApp and TikTok

  • వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గా 'జూమ్' యాప్ కు ప్రజాదరణ
  • గూగుల్ ప్లేస్టోర్ నుంచి 50 మిలియన్లకు పైగా డౌన్ లోడ్
  • 50 మందితో ఒకేసారి వీడియో కాల్ 'జూమ్' ప్రత్యేకత

సాంకేతిక ఆవిష్కరణలకు అంతులేదని చెప్పాలి. పాత పరిజ్ఞానాన్ని తలదన్నేలా కొత్త సాంకేతికత పుట్టుకురావడం సర్వసాధారణం. అందుకు ఉదాహరణ 'జూమ్' యాప్. ఇదో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్. దీని సాయంతో అత్యధికులు ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనే వీలుంటుంది.

టెక్ పరిభాషలో ఈ తరహా వీడియో కాలింగ్ ను క్లౌడ్ కాన్ఫరెన్స్ గా పిలుస్తారు. ఈ యాప్ లో వీడియో, ఆడియా నాణ్యత వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఇప్పుడిది భారత్ లో అత్యధికంగా డౌన్ లోడ్ అవుతున్న నెంబర్ వన్ యాప్ గా నిలిచింది. పైగా ప్రస్తుతం ఇండియాలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ సమయంలో డౌన్ లోడ్స్ అధికంగా వున్నాయి. ఈ క్రమంలో 'జూమ్' యాప్ ధాటికి వాట్సాప్, టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ కూడా వెనుకబడ్డాయి.

గూగుల్ ప్లే స్టోర్ లో అత్యధికులు 'జూమ్' యాప్ నే డౌన్ లోడ్ చేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ప్లే స్టోర్ నుంచి 'జూమ్' యాప్ ను 50 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ఆ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. 'జూమ్' యాప్ లో వైర్ లెస్ స్క్రీన్ షేరింగ్ ఫీచర్ కూడా ఉంది. 50 మందితో వీడియో కాల్ నిర్వహించగలిగే ఫీచర్ ప్రస్తుత మార్కెట్లో ఒక్క 'జూమ్' యాప్ కే సొంతం. అందుకే ఇది యూత్ లో విపరీతమైన ఆదరణ పొందుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే జూమ్ యాప్ సంస్థ అధినేత ఎరిక్ యువాన్. యువాన్ తన సంస్థను కొద్దికాలంలోనే వేల కోట్ల విలువైన సంస్థగా మలిచాడు.

  • Loading...

More Telugu News