Corona Virus: 18 నెలల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకురావడం సాధ్యమేనా..?
- హెచ్ఐవీ వ్యాక్సిన్ కోసం దశాబ్దాల తరబడి సాగుతున్న పరిశోధనలు
- ఇప్పటికీ ఫలించని ప్రయత్నాలు
- కరోనా వ్యాక్సిన్ పరిస్థితీ అందుకు భిన్నం కాదంటున్న గత అనుభవాలు!
చాన్నాళ్ల కిందట వెలుగుచూసిన హెచ్ఐవీ భూతం ప్రపంచవ్యాప్తంగా వేల జీవితాలను కబళించింది. ఇప్పటికీ ఉనికి చాటుకుంటూనే ఉంది. అదుపుచేయగల సాంక్రమిక వ్యాధి అయినా, సామాజిక జీవనానికి ముప్పుగా మారడంతో దీనిపై అప్పట్లో ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో దృష్టి సారించాయి. 80వ దశకం చివర్లో మైకేల్ కించ్ అనే యువ పరిశోధకుడు హెచ్ఐవీకి వ్యాక్సిన్ రూపొందించాలని తీవ్రంగా శ్రమించాడు. కానీ ఫలితం దక్కలేదు. కించ్ మాత్రమే కాదు, నిధులకు కొరతలేని అనేక ప్రయోగశాలలు ఈ విషయంలో చేతులెత్తేశాయి. 30 ఏళ్లలో 30 మిలియన్ల మరణాలు సంభవించిన తర్వాత కూడా హెచ్ఐవీకి నిర్దిష్ట వ్యాక్సిన్ అంటూ కనుగొనలేకపోయారు. ఇప్పుడు కరోనా అంశంలో ఇదే ఫలితం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కరోనా మహమ్మారి అంతు చూసే వ్యాక్సిన్ ను వచ్చే ఏడాదిలోగా తీసుకురావాలన్న ప్రయత్నాలను హెచ్ఐవీ ఉదంతం ప్రశ్నార్థకంగా మార్చుతోంది. ప్రతి వైరస్ కు ఓ విరుగుడు అనేది తప్పకుండా ఉంటుందని, దానిపై తీవ్రస్థాయిలో పరిశోధించడమే మన ముందున్న కర్తవ్యం అని ప్రస్తుతం వాషింగ్టన్ యూనివర్సిటీ అసోసియేట్ వైస్ చాన్సలర్ గా పనిచేస్తున్న మైకేల్ కించ్ పేర్కొన్నారు.
అమెరికా ప్రభుత్వంతో కలిసి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకే దాదాపు రూ.7 వేల కోట్లకుపైగా కుమ్మరించేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. అనేక దేశాలు సైతం కరోనా వ్యాక్సిన్ ను రూపొందించే పనిలో తలమునకలయ్యాయి. అయితే, దశాబ్దాలుగా హెచ్ఐవీ వ్యాక్సిన్ పరిశోధనలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న పరిస్థితుల్లో... కేవలం 18 నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు వేయడం చూస్తుంటే, ఇది సాధ్యమయ్యేపనేనా అని సందేహం కలుగుతోంది.
ఓ వ్యాక్సిన్ ల్యాబ్ నుంచి మార్కెట్లోకి రావాలంటే ఎంతో సమయం పడుతుంది. దశలవారీగా ప్రయోగాలు నిర్వహించడం వాటిలో అత్యంత కీలకం. చివరగా మనుషులపై ప్రయోగించి సత్ఫలితాలు ఇస్తాయని నిర్ధారించిన తర్వాతే వ్యాక్సిన్లకు అనుమతి లభిస్తుంది. ఇందుకు పట్టే కనీస సమయం 12 నుంచి 18 నెలలు. కొన్ని వ్యాక్సిన్ల తయారీకి సంవత్సరాలు పట్టిన సందర్భాలున్నాయి. అలాంటిది వచ్చే ఏడాది నాటికి కరోనాకు విరుగుడు ఔషధం వస్తుందా అంటే.. ఏమోనన్న సమాధానమే వినిపిస్తోంది.