Pawan Kalyan: ముంబయిలో చిక్కుకున్న ఆ 500 మందిని ఆదుకోండి: పవన్ కల్యాణ్
- మహారాష్ట్ర సీఎంకు విజ్ఞప్తి
- లాక్ డౌన్ తో అలమటిస్తున్నారని వెల్లడి
- తిండి, నీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన
కరోనా లాక్ డౌన్ కారణంగా ముంబయిలో 500 తెలుగు కుటుంబాలు చిక్కుకుపోయాయని, వారిని ఆదుకోవాలని జనసేనాని పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ కారణంగా వ్యవస్థలు నిలిచిపోవడంతో తినడానికి తిండిలేక, తాగునీరు లేక అలమటిస్తున్నారని తెలిపారు.
వారంతా కర్నూలు జిల్లాకు చెందిన వలస కార్మికులని... ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాలకు చెందినవారని, ఉపాధి కోసం ముంబయి వెళ్లి లాక్ డౌన్ కారణంగా అక్కడే నిలిచిపోయారని వివరించారు. ప్రస్తుతం వారందరూ ముంబయి శివారు ప్రాంతం గోమహళ్లి వెస్ట్ ప్రాంతంలో ఉన్నారని, వారిలో మహిళలు, పసికందులు కూడా ఉన్నారని పవన్ తెలిపారు. వారంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారని, పసిబిడ్డలకు గ్లాసు పాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఉద్ధవ్ థాకరే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.