Arvind Kejriwal: మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారిలో 441 మందికి ‘కరోనా’ లక్షణాలు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- ఢిల్లీలో ఇప్పటి వరకు 97 ‘కరోనా’ కేసులు నమోదు
- అందులో 24 మంది మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారే
- మర్కజ్ భవన్ లో కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యతా రాహిత్యం
ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి బయటకు తీసుకొచ్చిన వారిలో 441 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మర్కజ్ భవన్ లో ఉండొచ్చిన 1500 మంది తబ్లీక్ జమాత్ గ్రూప్ కార్యకర్తలు క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు.
ఢిల్లీలో ఇప్పటి వరకు 97 ‘కరోనా’ కేసులు నమోదయ్యాయని, అందులో 24 మంది మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ‘కరోనా’ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య పెరుగుతోందని, అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలు, ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా మర్కజ్ భవన్ లో కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని, బాధ్యతా రాహిత్యమైన చర్య అని విమర్శించారు. ఎవరు ఏ మతానికి చెందిన వారైనా వారి ప్రాణాలు విలువైనవి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్ని మతాల పెద్దలకు సూచించారు.