Italy: ఫ్రాన్స్‌లో కరోనా మరణాలకు పడని అడ్డుకట్ట.. నిన్న ఒక్క రోజే 499 మంది మృతి
- ఫ్రాన్స్‌లో కోవిడ్ కారణంగా 3,523 మంది మృతి
- ఇటలీలోనూ పెరుగుతున్న మరణాలు
- అత్యధిక మరణాలతో బాధిత దేశంగా మారిన ఇటలీ
కరోనా వైరస్ బారినపడి ఫ్రాన్స్‌లో నిన్న ఒక్క రోజే 499 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. తాజాగా మృతి చెందిన వారితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,523కి చేరుకోగా, 22,757 మంది వైరస్ బారినపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే, 5,565 మందిపై నిఘా కొనసాగుతున్నట్టు ఆరోగ్య విభాగపు అధికారి జెరోమ్ సలోమన్ తెలిపారు. మరోవైపు, ఇటలీలో మరణాల సంఖ్యకు అడ్డుకట్ట పడడం లేదు. 24 గంటల్లోనే అక్కడే ఏకంగా 837 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 12,428కి పెరిగింది.
ప్రపంచంలోనే అత్యధిక మరణాలతో బాధిత దేశంగా ఇటలీ మారిపోయింది. అలాగే, కరోనా రోగుల సంఖ్య 1,05,792కు పెరిగింది. ఇటలీ తర్వాత స్పెయిన్, అమెరికా దేశాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 188,530కు పెరగ్గా, 3889 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 8,644 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 42,151 మందిని కోవిడ్ బలితీసుకుంది.