Italy: ఓవైపు కరోనా మరణ మృదంగం.. మరోవైపు ఆంక్షలను సడలిస్తున్న ఇటలీ.. తీవ్ర విమర్శలు!
- ఇటలీలో కరోనాకు బలైన 12,428 మంది
- పిల్లలను తల్లిదండ్రులు బయటకు తీసుకెళ్లొచ్చన్న ప్రభుత్వం
- ప్రభుత్వ నిర్ణయం హాస్యాస్పదంగా ఉందంటున్న ఇటలీ వైద్యాధికారులు
కరోనా దెబ్బకు ఇటలీ కకావికలమైన సంగతి తెలిసిందే. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో 1,648 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,05,792కు చేరగా... వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 77,635గా ఉంది. ఇప్పటి వరకు 12,428 మరణాలు సంభవించాయి.
ఓపక్క పరిస్థితి ఇంత భయానకంగా ఉన్న తరుణంలో... ఆ దేశ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం విమర్శలపాలవుతోంది. ప్రజలపై విధించిన ఆంక్షలను ఆ దేశం సడలించింది. పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో నడకకు తీసుకెళ్లొచ్చని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ప్రకటించారు. ఈ ప్రకటనపై అక్కడి వైద్యాధికారులు మండిపడుతున్నారు.
మిలాన్ ప్రాంతానికి చెందిన హెల్త్ చీఫ్ గిలియో గల్లెరా ఈ సందర్భంగా స్పందిస్తూ... ప్రభుత్వ నిర్ణయం హస్యాస్పదంగా ఉందని అన్నారు. వైరస్ కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలను కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు సరికావని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల పరిస్థితి మరింత అదుపుతప్పే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.