Maratorium: ఈఎంఐలపై మారటోరియం.. స్పందించిన ప్రైవేట్ బ్యాంకులు!
- లాక్ డౌన్ నేపథ్యంలో ఈఎంలపై 3 నెలల మారటోరియం
- ఇప్పటికే ముందుకొచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు
- దీనిపై ప్రైవేట్ బ్యాంకుల తాజా ప్రకటన
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారు బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంలపై మూడు నెలల మారటోరియం సదుపాయం కల్పించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల సూచించిన విషయం తెలిసిందే.
ఈ సూచనల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే ఆ సదుపాయం కల్పిస్తూ ప్రకటనలు చేశాయి. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా ముందుకొచ్చాయి. ఈఎంఐలపై మారటోరియం అవసరం లేని వినియోగదారులు తమను సంప్రదించాల్సిన అవసరం లేదంటూ తమ ఖాతాదారులకు హెచ్ డీఎఫ్ సీ, కోటక్ మహీంద్ర బ్యాంకులు విజ్ఞప్తి చేస్తున్నాయి.
మారటోరియం కోరుకునే వినియోగదారుల కోసం ఓ ఈ-మెయిల్ ఐడీని కోటక్ మహీంద్ర బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. మారటోరియం కాలానికి వడ్డీని వసూలు చేస్తామని తెలిపింది. మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ కూడా ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. వేతనం దారుల రుణాలపై ‘ఆప్ట్-ఇన్’ , వ్యాపారుల కోసం ‘ఆప్ట్-ఔట్’ ఆప్షన్స్ ను తీసుకొచ్చింది. మరో ప్రైవేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు మాత్రం మారటోరియం విధివిధానాలపై పనిచేస్తున్నట్టు తెలిపింది.