Corona Virus: కరోనా వైరస్ గాల్లో ప్రయాణించే దూరంపై తాజా అధ్యయనం.. వివరాలు!
- నీటి తుంపరలతో కలిసి 27 అడుగుల దూరం వెళ్లే వైరస్
- 4 గంటల పాటు జీవిత కాలం
- 8 మీటర్ల సామాజిక దూరం తప్పనిసరంటున్న సైంటిస్టులు
కరోనా వైరస్ సోకిన వారు దగ్గినా, తుమ్మినా, ఆఖరికి ఊపిరి వదిలినా, వైరస్ గాల్లోకి వచ్చి ఇతరులకు వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ఒక మీటరు దూరం వరకు ప్రయాణించగలదన్న కారణంతో మనిషికి, మనిషికి మధ్య కనీస భౌతిక దూరం ఒక మీటరు (మూడు అడుగులు) ఉండేలా చూసుకోవాల్సి వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, ఈ వైరస్ ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు జరిపిన తాజా పరిశోధన ప్రకారం, ఈ వైరస్ గాల్లో నాలుగు గంటల పాటు జీవించే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన సూచనలు ఎంతవరకూ పనిచేస్తాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.
మసాచుసెట్స్ శాస్త్రవేత్తల పరిశోధనా వివరాలు 'జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్' తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. 1930లో తుమ్ము, దగ్గు వంటి వాటివల్ల బయటకు వచ్చే క్రిములపై జరిపిన పరిశోధనల తరువాత డబ్ల్యూహెచ్ఓ, ఆ భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, ఇప్పుడు వైరస్ లు బలపడటంతో, ఆ దూరం సరిపోదని పరిశోధనల్లో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా తెలియజేశారు.
నోరు, ముక్కు నుంచి బయటకు వచ్చే నీటి తుంపరలు వైరస్ ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం వరకూ ప్రయాణిస్తాయని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన అన్నారు. ప్రజలు ఇతరులతో సాధ్యమైనంత ఎక్కువ దూరాన్ని పాటిస్తేనే వైరస్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశాలు అధికమని స్పష్టం చేశారు.