Turkamenisthan: 'కరోనా' పదాన్ని నిషేధించిన తుర్కెమెనిస్థాన్... పేరు పలికినా జైలుకే!
- ఇప్పటివరకూ కరోనా సోకని దేశాల్లో తుర్కెమెనిస్థాన్
- మఫ్టీలో తిరిగే ప్రభుత్వ ప్రత్యేక ఏజంట్లు
- ప్రజలకు తెలిసిన సమాచారం కూడా అంతంతమాత్రమే
ప్రపంచమంతటినీ కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న వేళ, ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదు కాని తుర్కెమెనిస్థాన్, కరోనా అన్న పదం కూడా తమ దేశంలో వినిపించకుండా చేసింది. ఈ వైరస్ గురించి సోషల్ మీడియాలో చర్చించడాన్ని కూడా నిషేధించింది. మీడియా వార్తల్లో, ఆరోగ్య శాఖ పంపిణీ చేసే సమాచార పత్రాల్లోనూ ఈ పదం కనిపించరాదని ఆదేశించింది.
ఇక ప్రజలు ఎవరైనా కరోనా గురించి మాట్లాడితే, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం మఫ్టీలో సాధారణ దుస్తుల్లోనే ప్రభుత్వ ఏజెంట్లు ప్రజల మధ్య తిరుగుతున్నారు. రహస్యంగా ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారన్నది గమనించడమే వీరి విధి. వైరస్, దాని వ్యాప్తి గురించి మాట్లాడితే, ఇక అంతే. ఇక వైరస్ గురించిన సమాచారం ఇక్కడి ప్రజలకు అంతంతమాత్రంగానే తెలుసు.
కాగా, ఇంతవరకూ తుర్కెమెనిస్థాన్ లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం, ఇప్పటికే పౌర ఉద్యమాలను నిషేధించిన సర్కారు, రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. తుర్కెమెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బాంగులీ బైర్దేముకామెడోవ్, తమ దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, ఇక్కడ దేశాధ్యక్షుడిని 'ఫాదర్ ప్రొటెక్టర్' అని పిలుస్తారు.