Telangana: పొలాన్ని చదును చేస్తుండగా బయటపడ్డ పురాతన వెండి నాణేలు.. రెవెన్యూ అధికారుల స్వాధీనం
- వికారాబాద్ జిల్లా ఎల్మకన్నెలో ఘటన
- సహకార సంఘం డైరెక్టర్ పొలంలో నాణేలు
- తలా కొన్ని తీసుకున్న వైనం
పొలాన్ని చదును చేస్తున్న రైతుకు వెండి నాణేలు లభ్యమైన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన సహకార సంఘం డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం తన పొలాన్ని దున్నుతుండగా వెండి నాణేలు బయటపడ్డాయి.
ఈ విషయాన్ని గుట్టుగా ఉంచిన వెంకట్రామిరెడ్డితోపాటు అక్కడున్న వారు చెరో కొన్ని నాణేలను పట్టుకెళ్లారు. అయితే, విషయం ఆనోటా, ఈ నోటా పడి రెవెన్యూ అధికారులు, పోలీసులకు చేరింది. విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం నిన్న పోలీసులతో కలిసి రెవెన్యూ అధికారులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. నాణేలు బయటపడిన విషయాన్ని నిర్ధారించుకుని వెంకట్రామిరెడ్డి ఇతరుల నుంచి 141 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.