Sonia Gandhi: ఈఎంఐలు వాయిదా వేశారు సరే... వడ్డీ రాయితీలు ఏవి?: కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియా
- కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్
- మూడు నెలలలు ఈఎంఐలు వాయిదా వేసిన కేంద్రం
- మధ్యతరగతి ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్న సోనియా
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్రం దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మధ్యతరగతి జీవులకు ఊరట కలిగించేలా ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేస్తూ వెసులుబాటు కల్పించారు. దీనిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. హౌసింగ్, వ్యక్తిగత అవసరాలు, ఆటోమొబైల్, ఇతరత్రా అంశాలపై మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేశారని, కానీ వాటిపై వడ్డీ రాయితీని ఎందుకు ప్రకటించలేదని ఓ ప్రకటనలో ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.
"మధ్యతరగతి ప్రజల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అన్నిరంగాల్లో వేతనాల కోత, ఉద్యోగాల్లోంచి తీసివేతలు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, గ్యాస్ అధికధరలు వంటివి వారిని ఉన్నపళాన కుంగదీస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు, ఈఎంఐలు వాయిదా వేసినా వడ్డీ రాయితీ మాత్రం ప్రకటించలేదు. వడ్డీ రాయితీ ప్రకటించకపోతే మీరు ఈఎంఐలు వాయిదావేసినా ప్రయోజనం లేదు" అని పేర్కొన్నారు.