Talasani: ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లపై దాడులు చేయడం ఏంటి?: 'గాంధీ' ఘటనపై తలసాని స్పందన
- గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి తలసాని
- డాక్టర్లపై రోగి బంధువుల దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటన
- ఆసుపత్రిలో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేస్తామని హామీ
గాంధీ ఆసుపత్రి వైద్యులపై నిన్న కరోనా రోగి బంధువులు దాడి చేసిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ఆయన ఇవాళ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. వైద్యులపై దాడికి దారి తీసిన కారణాలను, దాడి జరిగిన తీరును ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడి చేయడాన్ని ఖండించారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి డాక్టర్లు మనకు వైద్యం అందిస్తున్నారని, అలాంటివారిపై దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. గాంధీ ఆసుపత్రి వద్ద ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేస్తామని, డాక్టర్లకు మరింత భద్రత కల్పిస్తామని వెల్లడించారు.
అటు, తమపై జరిగిన దాడిని గాంధీ ఆసుపత్రి వైద్యులు అమానుష చర్యగా అభివర్ణించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు తమపై దాడి చేశారని, ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని అన్నారు. తాము 24 గంటలూ పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.