Tablighi Jamaat: డాక్టర్లు చెప్పింది వినండి, ప్రభుత్వ ఆదేశాలను పాటించండి: తబ్లిగీలకు జమాత్ చీఫ్ హితవు
- ప్రభుత్వానికి సహకరించాలని సూచన
- చట్టాన్ని ధిక్కరించవద్దంటూ స్పష్టీకరణ
- గుంపులుగా గుమికూడవద్దని విజ్ఞప్తి
ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో మతబోధకులు రావడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరైన వాళ్లలో చాలామంది కరోనా బారినపడడంతో ఆ కార్యక్రమ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖందాల్వీ స్పందిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న తన అనుచరగణానికి పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా డాక్టర్లు చెప్పింది వినాలని, సూచనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనం గుంపులుగా గుమికూడకుండా ఉండడం ద్వారా ప్రభుత్వానికి సహకరించినవాళ్లం అవుతాం అని సూచించారు.
"మనం చట్టాన్ని ధిక్కరించకూడదు. అలాంటి ఉల్లంఘన మన సిద్ధాంతాలకే వ్యతిరేకం" అంటూ ఓ వీడియో సందేశాన్ని యూట్యూబ్ లో పోస్టు చేశారు. ఖందాల్వీ ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అటు, ఆయన న్యాయవాదుల్లో ఒకరు దీనిపై స్పందిస్తూ, కరోనా విపత్తు ఎంతో తీవ్రమైన అంశం, ఈ వైరస్ వ్యాప్తికి కారణం ఎవరు అనే విషయంలో మనం తలదూర్చకూడదు అని తబ్లిగీలకు స్పష్టం చేశారు.