Narendra Modi: 14తో లాక్ డౌన్ ఎత్తివేత... సంకేతాలిచ్చిన మోదీ... రేపు ఉదయం జాతిని ఉద్దేశించి వీడియో సందేశం!
- నేడు సీఎంలతో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ
- సామాజిక దూరం పాటిస్తూనే లాక్ డౌన్ ఎత్తివేత
- కరోనాను తరిమేసే వ్యూహంపై చర్చ
21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా, ఆ తరువాత దానిని పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. కరోనా వైరస్ పై ఈ మధ్యాహ్నం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని, కరోనా వైరస్ ను తరిమేసేందుకు వ్యూహాన్ని ఆలోచించి, దాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో పెద్ద పెద్ద సభలు, సమావేశాలపై నిషేధం ఉంటుందని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించుకునే వీలును కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని మోదీ తన మనసులోని మాటను సీఎంలతో పంచుకున్నట్టు తెలుస్తోంది.
దీంతో 15 తరువాత లాక్ డౌన్ ఉండే అవకాశాలు అంతంతమాత్రమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారిపై మరో పది రోజుల పాటు సాగనున్న లాక్ డౌన్ పోరాటం తరువాత, ఇండియాలో కేసుల పరిస్థితి, వైరస్ విస్తరిస్తున్న తీరుపై ఓ అవగాహన వస్తుంది. దాన్ని బట్టి, 10వ తేదీ తరువాత కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం మీడియాకు ప్రెస్ రిలీజ్ ను విడుదల చేసిన ప్రధాన మంత్రి కార్యలయం, వైద్య ఉత్పత్తుల సరఫరాకు ఎలాంటి అడ్డంకులూ లేవని స్పష్టం చేసింది. వైద్య పరికరాలు, ఔషధాలు తయారు చేసే సంస్థలకు అవసరమైన ముడిసరుకు సరఫరా సక్రమంగా సాగుతోందని పేర్కొంది. అనుమానిత కేసులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలకంగా వ్యవహరించాయని పేర్కొంది.
ఇదిలావుండగా, రేపు ఉదయం తాను జాతిని ఉద్దేశించి వీడియో సందేశాన్ని ఇవ్వనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ప్రధాని ఏ విషయం గురించి ప్రజలకు వివరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.