Narendra Modi: తక్కువ ప్రాణ నష్టంతో గట్టెక్కడమే లక్ష్యం: ప్రధాని మోదీ

The goal was to ensure minimum loss of life PM To States
  • 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌
  • లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులకు ఉమ్మడి ప్రణాళిక ఉండాలన్న ప్రధాని
  • రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌, సోషల్‌ డిస్టెన్స్‌ను పక్కాగా అమలు చేయాలని సూచన
దేశంలో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత పరిస్థితులను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ మన జీవన విధానానికి ముప్పు కలిగిస్తోందని ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన అన్నారు. అందువల్ల లాక్‌డౌన్ ముగిశాక.. ప్రజలు తిరిగి సాఫీగా జీవనం గడిపేందుకు తగిన ప్రణాళిక రచించాలన్నారు. ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని రాష్ట్రాలను కోరారు. వీలైనంత తక్కువ ప్రాణనష్టంతో ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
 
లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణంగా ఉండబోవన్న ప్రధాని.. తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే, లాక్‌డౌన్‌ను రాష్ట్రాలు పక్కాగా అమలు చేయాలని, సోషల్ డిస్టెన్స్‌ కు కట్టుబడి ఉండాలని కోరారు. ‘వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. వైరస్ హాట్ స్పాట్లు గుర్తించి, వాటిని నిర్బంధం చేయాలి. రాబోయే వారాల్లో పరీక్షల నిర్వహణ, వైరస్ సోకిన వారిని గుర్తించడం, ఐసోలేషన్, క్వారంటైన్ నిర్వహణపైనే దృష్టి పెట్టాలి’ అని ప్రధాని సూచించారు.

కొన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తి రెండో దశలోకి చేరుకుందన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితి అంత బాగాలేదని ప్రధాని అభిప్రాయపడ్డారు. తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన ఈ  వీడియో కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Narendra Modi
states
Chief Ministers
Corona Virus
goal

More Telugu News