Tablighi Jamaat: అసలేమిటీ తబ్లిగీ జమాత్... వీరేం చేస్తుంటారు..?
- కరోనా ప్రభావంతో బాగా వినిపిస్తోన్న తబ్లిగీ జమాత్ పేరు
- ఇటీవల ఢిల్లీలో మత సమ్మేళనం నిర్వహణ
- ఈ సమావేశాలకు వెళ్లొచ్చిన వారికి కరోనా పాజిటివ్
ఇటీవలి వరకు తబ్లిగీ జమాత్ అనే పేరును భారతీయుల్లో అత్యధికులు విని ఉండరు. అయితే, కొన్నిరోజులుగా ఈ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడిన వారిలో చాలామందితో తబ్లిగీ జమాత్ అనే పేరు ముడిపడి ఉంది. తబ్లిగీ జమాత్ అనేది ఓ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. ఇస్లాం మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఏర్పాటైన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా అనుచర గణం ఉంది.
మొన్న ఢిల్లీలోని ఆలమీ మర్కజ్ ప్రాంగణంలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశానికి దాదాపు 2000 మంది హాజరయ్యారు. వారిలో ఇండోనేషియా, మలేషియా నుంచి వచ్చినవాళ్లూ ఉన్నారు. ఈ సమావేశాలు మార్చి 13న పూర్తికాగా, సరిగ్గా రెండు వారాల తర్వాత తబ్లిగీ జమాత్ కు హాజరైన వారిలో కొందరికి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అనేక రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. ఆ కేసుల మూలాలు వెతికిచూస్తే ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ లింకు బయటపడింది. దాంతో తబ్లిగీ జమాత్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎలా ఏర్పాటైందంటే...
దియోబందీ ఇస్లామిక్ వాది మహ్మద్ ఇల్యాస్ అల్ ఖందాల్వీ ది తబ్లిగీ జమాత్ ను 1926లో మేవాట్ లో స్థాపించారు. తబ్లిగీ జమాత్ అంటే మతబోధకుల వర్గం అని అర్థం. ముస్లిం ప్రపంచానికి అంకితభావంతో పనిచేసే మతబోధకులను అందించడం తబ్లిగీ జమాత్ ప్రాథమికోద్దేశం. తబ్లిగీ అంటే పవిత్ర ప్రచారకుడు. నికార్సయిన ఇస్లాంను ప్రబోధించడమే వారి పని. ప్రతి ఏడాది వారికి శిక్షణ తరగతులు జరుగుతాయి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ పండితులతో మత సమ్మేళనాలు కూడా నిర్వహిస్తుంటారు. బ్రిటీష్ హయాంలో ఎంతో వేగంగా ఎదిగిన తబ్లిగీ జమాత్ తొలి సభ 1941లో జరగ్గా, ఆ రోజుల్లోనే 25 వేల మంది హాజరయ్యారట. దేశ విభజన తర్వాత పాకిస్థాన్ లో, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఇది మరింత బలంగా వేళ్లూనుకుంది.
తబ్లిగీల ప్రధాన కర్తవ్యం ఏంటంటే...
మహ్మద్ ప్రవక్త సూచించిన విధంగా జీవించాలంటూ ముస్లింలకు ప్రబోధించడమే వీరి పని. అయితే వీరు సూఫీ ఇస్లాం వాదాన్ని వ్యతిరేకిస్తుంటారు. అంతేకాదు, మహ్మద్ ప్రవక్త తరహాలో దుస్తులు ధరించడాన్ని ఇష్టపడతారు, ప్రోత్సహిస్తారు. మీసం లేకుండా పొడవాటి గడ్డాలు పెంచడం వీరి వేషధారణలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశం. ఇస్లాం పట్ల ఇతరులను ఆకర్షించడమే కాదు, స్వచ్ఛమైన ఇస్లాం కోసం కృషి చేయడం వీరి విధుల్లో భాగం.
150 దేశాల్లో ప్రతినిధులు
ప్రస్తుతం తబ్లిగీ జమాత్ కు 150 దేశాల్లో అనుచరులు ఉన్నారు. ఈ సంస్థకు ప్రస్తుత అధిపతి మౌలానా సాద్ ఖందాల్వీ. జమాత్ వ్యవస్థాకుడు ఇల్యాస్ ఖందాల్వీ మనవడే ఈ సాద్ ఖందాల్వీ. తబ్లిగీ జమాత్ ప్రతినిధులు తాము ఏ రాజకీయ పక్షానికి చెందనివారమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వీరు తరచుగా చిన్న చిన్న బృందాలుగా విడిపోయి ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ ప్రవక్త బోధనలను ముస్లిం సమాజాల్లో మరింత బలంగా ప్రచారం చేస్తుంటారు.
జమాత్ పై ఓ కన్నేసిన అజిత్ దోవల్!
సాధారణంగా తబ్లిగీ జమాత్ సిద్ధాంతం శాంతికాముకత. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే, ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన అజిత్ దోవల్ దీనిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'ఈ ఆర్గనైజేషన్ వ్యవహారాల్లో రహస్య సంస్కృతి కనిపిస్తోంది. అందుకే అనుమానాలు బలపడుతున్నాయి' అంటూ 2013లో వ్యాఖ్యానించారు. ప్రభుత్వమెప్పుడూ ఈ ఉద్యమాన్ని వ్యతిరేకమైనదిగా పరిగణించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక, తబ్లిగీ జమాత్ ను వ్యతిరేకించే దేశాలు కూడా ఉన్నాయి. మధ్య ఆసియా దేశాలు, ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దేశాలైన తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి దేశాల్లో దీనిపై నిషేధం ఉంది.