Corona Virus: మాట్లాడినా వ్యాపించేస్తున్న కరోనా వైరస్.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Corona Can Spread While Talking

  • తుమ్మినా, దగ్గినా వ్యాపిస్తున్న వైరస్
  • 6 అడుగుల దూరంలోని వారికీ సోకుతున్న వైరస్
  • నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ లో వెల్లడి

కరోనా మహమ్మారి తుమ్మినా లేదా దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ఇంతకాలమూ భావిస్తూ రాగా, తాజా అధ్యయనంలో మాట్లాడినా లేదా, కరోనా సోకిన వ్యక్తి పక్కనే ఉండి గాలిని పీల్చుకున్నా కూడా వైరస్ సోకే ప్రమాదముందని తేలింది. యూఎస్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, డాక్టర్ హార్వే ఫినెబర్గ్ అధ్యక్షతన ఓ కమిటీని వేయగా, వారు రీసెర్చ్ నిర్వహించి, దాని ఫలితాలను వైట్ హౌస్ కు తెలిపారు. ఏదో ఒక మాస్క్ వేసుకునే బయటకు కాలు పెట్టడం మంచిదని తాను అభిప్రాయపడుతున్నట్టు డాక్టర్ హార్వే ఫినెబర్గ్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు.  

ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న వైరస్ పై జరిగిన పరిశోధనలు చాలా తక్కువని అభిప్రాయపడ్డ ఫినెబర్గ్, సాధారణంగా పీల్చే ఊపిరితోనూ వైరస్ క్రిములు శరీరంలోకి వెళ్లిపోతున్నాయని అన్నారు. "ఓ సర్జికల్ మాస్క్ ను ధరించాలని నేను భావించడం లేదు. ఎందుకంటే,  వైద్యులకు వాటి అవసరం ఎంతైనా ఉంది. అయితే, ముక్కు, నోటికి ఏదో ఒక ఆచ్చాదన మాత్రం వుండాలి" అని హార్వార్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ విభాగం మాజీ డీన్ గానూ పని చేసిన ఫినెబర్గ్ తెలిపారు.  

ఎన్ఏఎస్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గానూ ఉన్న ఆయన, తాను వైట్ హౌస్ కు రాసిన లేఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయం నుంచి కెల్విన్ డ్రాయిగ్ మెయిర్ సంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలను కూడా ఇచ్చారు. "మీ ప్రశ్నలకు నా లేఖలో సమాధానం ఉంది. కరోనా వైరస్ మాట్లాడటం ద్వారా కూడా వ్యాపించవచ్చు. తుమ్మినా, దగ్గినా ఆ తుంపరల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. ఈ వైరస్ రోగుల నుంచి డైరెక్ట్ గా విడుదల అయ్యే బయో ఏరోసోల్స్ ద్వారానూ వ్యాపిస్తుంది" అని తెలిపారు.

కరోనా సోకిన రోగికి ఆరు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా తుమ్ము లేదా దగ్గు వల్ల వైరస్ వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది. ఇది నిజమేనని, తమ రీసెర్చ్ లోనూ ఈ విషయం వెల్లడైందని ఫినెబర్గ్ వెల్లడించారు. చైనాలోని ఓ ఆసుపత్రిలో జరిగిన రీసెర్చ్ వివరాలను తన లేఖలో పొందుపరిచిన ఆయన, గదులను శుభ్రపరిచిన తరువాత, ప్రొటెక్టివ్ వేర్ ధరించిన స్టాఫ్ అటూ ఇటూ తిరుగున్నప్పుడు, వైరస్ గాల్లోనే నశిస్తోందని తేలిందని తెలిపారు. కరోనా పేషంట్లకు ఆరు అడుగుల దూరంలోనూ వైరస్ ను కనుగొన్నట్టు యూనివర్శిటీ ఆఫ్ నెబ్రాస్కా రీసెర్చ్ తేల్చిందని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News