Lockdown: నాగపూర్ నుంచి తమిళనాడుకు నడిచి వెళుతూ... హైదరాబాద్ లో మరణించిన యువకుడు!
- లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన చదువు
- మిత్రులతో కలిసి కాలినడకన స్వస్థలానికి లోకేశ్
- మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి
- మృతదేహాన్ని తరలించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు
లాక్ డౌన్ కారణంగా విద్యాభ్యాసం ఆగిపోగా, ఓ యువకుడు, కొందరు మిత్రులతో కలిసి కాలినడకన తమిళనాడులోని స్వస్థలానికి వెళుతూ, హైదరాబాద్ లో మరణించాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, లోకేశ్ (22), నామక్కల్ సమీపంలోని పిళ్లైపాలయం ప్రాంతానికి చెందిన వాడు. నాగపూర్ లో అగ్రికల్చర్ విద్యను అభ్యసిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అతను తన స్నేహితులతో కలిసి తమిళనాడుకు బయలుదేరాడు.
మూడు రోజుల ప్రయాణం తరువాత వీరికి ఓ ట్రక్ దొరికింది. దానిలో వస్తుండగా, సికింద్రాబాద్ పోలీసులు, వీరిని ఓ చెక్ పోస్ట్ వద్ద గుర్తించారు. లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారంటూ, పోలీసులు వీరి వివరాలు సేకరిస్తుండగా, తన గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పిన లోకేశ్, ఆ వెంటనే కుప్పకూలాడు. పోలీసులు '108' అంబులెన్స్ కు ఫోన్ చేయగా, అది వచ్చేలోపే స్పాట్ లో మరణించాడని మారేడుపల్లి పోలీసులు తెలిపారు.
ఆపై లోకేశ్ స్నేహితులు, అతని మృతదేహాన్ని స్వస్థలం చేర్చేందుకు సహకరించాలని జిల్లా అధికారుల వద్ద మొరపెట్టుకోగా, జీహెచ్ఎంసీ స్పందించింది. అతని మృతదేహాన్ని నామక్కల్ తరలించే ఏర్పాట్లు చేసినట్టు అధికారులు వెల్లడించారు.