Uttar Pradesh: విపత్తు సమయంలో జననం... కరోనా, కోవిడ్ గా నామకరణం!
- రాయపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన కవలలు
- ఉత్తరప్రదేశ్ కి చెందిన దంపతులు ఇక్కడ నివాసం
- లాక్‌డౌన్ కష్ట సమయంలో పుట్టారని ఈ నిర్ణయం
కరోనా, కోవిడ్...ఈ రెండు పేర్లు గురించి ఇప్పుడు ప్రపంచంలో తెలియని వారు లేరు. అవే పేర్లు తమ ముద్దుల కవల పిల్లలకు పెట్టి మురిసిపోతున్నారు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ప్రీతివర్మ దంపతులు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ కథనం చదవండి. రాయ్‌పూర్‌లో నివాసం ఉంటున్న ప్రీతివర్మకు ఈనెల 26వ తేదీన పురిటినొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. లాక్‌డౌన్ కట్టడితో క్లిష్ట పరిస్థితుల్లో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈనెల 27వ తేదీ తెల్లవారు జామున ఆమె పండంటి కవలలకు (మగపిల్లాడు, ఆడపిల్ల) జన్మనిచ్చింది.
ఆ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టి ఈ దంపతులు మురిసిపోతున్నారు. ఈ సందర్భంగా బిడ్డల తల్లి ప్రీతివర్మ ఓ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధితో మాట్లాడుతూ 'నేను గర్భవతిని అయ్యాక నాకు మగపిల్లాడు పుడితే ఏం పేరు పెట్టాలి, ఆడపిల్ల పుడితే ఏ పేరు పెట్టాలి అని నేను, నా భర్త ఓ మాట అనుకున్నాం. కానీ లాక్‌డౌన్ కష్టాల నేపథ్యంలో ఆసుపత్రికి చేరేందుకు, అనంతరం కష్టాలు చూశాక మనసు మార్చుకున్నాం.
ప్రజలు ధీరోదాత్తంగా కరోనాతో పోరాడుతున్న కాలంలో నాకు కవలలు జన్మించారు. ఈ సమయంలో మాకు, వారికి జీవితాంతం గుర్తుండాలన్న సరికొత్త ఆలోచన వచ్చింది. అదే సమయంలో ఆసుపత్రి సిబ్బంది కూడా మా కవల పిల్లలను కరోనా, కోవిడ్ అని ముచ్చటగా పిలుస్తుండడం మాకు ఆనందాన్ని కలిగించింది. అందుకే మేము ముందు అనుకున్న పేర్లను పక్కన పెట్టి ఈ కొత్త పేర్లు వారికి పెట్టుకున్నాం ' అని ప్రీతివర్మ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ వ్యక్తుల్లో భయాందోళనకు కారణమైనప్పటికీ పారిశుద్ధ్యం, ఆరోగ్య సూత్రాలు, మంచి అలవాట్లు ప్రజల్లో పాదుకొల్పేందుకు దోహదపడిందన్నది నా భావన అని ఆమె తెలిపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ జంట వృత్తిరీత్యా రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని పురానీ బస్తీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.