Corona Virus: పెంపుడు జంతువులతో కరోనా రాదు: అక్కినేని అమల
- సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నమ్మొద్దు
- పెంపుడు జంతువులతో వైరస్ వ్యాప్తిపై ఆధారాలు లేవు
- ట్విట్టర్లో ప్రజలకు సూచించిన అమల
కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మొద్దని సినీ నటి, బ్లూ క్రాస్ ప్రతినిధి అక్కినేని అమల సూచించారు. పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఇవన్నీ ఒట్టి పుకార్లే అని, ప్రజలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లేవని ఆమె ట్వీట్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
పెంపుడు జంతువులు వైరస్ వాహకాలు కావని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా వెల్లడించిన వివరాలను తన ట్విట్టర్ అకౌంట్లో అమల షేర్ చేశారు. ‘పెంపుడు జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాప్తి చెందుతుంది అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే, కుక్కలు, పిల్లులకు కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ. ఇక పెంపుడు జంతువుల్లో ఇప్పటిదాకా వైరస్ లక్షణాలు కనిపించలేదు. కరోనా వైరస్ అనేది కేవలం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే సంక్రమిస్తుంది’ అని హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ఇండియా పేర్కొన్నది.
ఈ విషయన్ని ప్రజలందరికీ తెలిసేలా షేర్ చేయాలని అమల కోరారు. అలాగే, నగరంలో చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేటు పశు వైద్యశాలలు తెరిచే ఉంటాయన్నారు. పెంపుడు జంతువుల సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.