Narendra Modi: సచిన్, కోహ్లీ, పీవీ సింధు సహా 40 మంది క్రీడాకారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్.. 5 సూత్రాలు చెప్పిన ప్రధాని
- ప్రజల్లో క్రమశిక్షణకు కృషి చేయాలన్న మోదీ
- సంకల్పం, సంయమనం, సకారత్మకత, సమ్మాన్, సహ్యోగ్ ఉండాలి
- వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, పీవీ సింధు, మేరీ కోమ్ సహా భారత్లోని 40 మంది ప్రముఖ క్రీడాకారులతో ప్రధాని మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో క్రీడాకారుల పాత్ర చాలా ముఖ్యమని మోదీ అన్నారు.
సామాజిక దూరం పాటించాలని, లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు. కరోనాపై పోరాడే సంకల్పం, సామాజిక దూరం పాటించే సంయమనం, సానుకూల దృక్పథంతో ఉండే సకారత్మకత, ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది, పోలీసులను గౌరవించే సమ్మాన్ విరాళాలు, సాయం అందించే సహ్యోగ్ ఉండాలని ఆయన ఐదు సూత్రాలు చెప్పారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజల్లో క్రమశిక్షణకు కృషి చేయాలని చెప్పారు.
మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మోదీ నాయకత్వాన్ని క్రీడాకారులు ఈ సందర్భంగా ప్రశసించారు. నిస్వార్థంగా పని చేస్తోన్న వైద్య సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న వారిలో పీటీ ఉష, పుల్లెల గోపిచంద్, విశ్వనాథన్ ఆనంద్, హిమా దాస్, బజరంగ్ పునియా, రోహిత్ శర్మ, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఛటేశ్వర్ పూజా కూడా ఉన్నారు.