corona beer: పేరు తెచ్చిన నష్టం.. 'కరోనా' బీరు ఉత్పత్తి బంద్!
- మెక్సికోలో హెల్త్ ఎమర్జెన్సీతో ఆగిన ప్రొడక్షన్
- కరోనా వైరస్ కారణంగా బ్రాండ్‌కు ఇప్పటికే నష్టం
- హైన్‌కెన్ కంపెనీ ఉత్పత్తి కూడా నిలుపుదల
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా మెక్సికోకు చెందిన ప్రముఖ బీర్ కంపెనీ కరోనా అమ్మకాలు ఇప్పటికే బాగా తగ్గాయి. వైరస్‌తో ఈ బీరుకు ఎలాంటి సంబంధం లేకున్నా ఒకే పేరు వల్ల కంపెనీకి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు తమ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించడంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు కరోనా బీర్ కంపెనీ ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిత్యావసరాలు మినహా ఇతర అన్ని వ్యాపారాలపై ఈ నెల 30వ తేదీ వరకు మెక్సికో ప్రభుత్వం నిషేధం విధించడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
కరోనా కంపెనీ.. పసిఫికో, మోడెలో అనే రెండు రకాల బీరు బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే తమ ప్రొడక్షన్‌ను తగ్గించామని కొన్ని రోజుల్లోనే మొత్తం నిలిపి వేస్తామని కంపెనీ చెప్పింది. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత కరోనా బ్రాండ్ బాగా దెబ్బతిన్నది. ఒక్క అమెరికాలోనే అమ్మకాలు 40 శాతం తగ్గాయి.
మెక్సికోకే చెందిన మరో బీర్ కంపెనీ ‘హైన్‌కెన్’ కూడా ఈ రోజు నుంచి తమ ఉత్పత్తిని నిలిపి వేస్తుందని స్థానిక మీడియా చెబుతోంది. కాగా, మెక్సికోలో ఇప్పటిదాకా 1500 మందికి కరోనా సోకగా.. అందులో 50 మంది చనిపోయారు.