Nizamuddin Markaz: మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 80 శాతం మందిని గుర్తించాం: జీహెచ్ఎంసీ మేయర్
- మిగతా వారు వైద్య సిబ్బందికి సహకరించాలి
- ఎంటమాలజీ విభాగంతో వీధి కుక్కలకు ఆహారం అందిస్తాం
- 1500 మంది యాచకులకు భోజనం పెడుతున్నామన్న బొంతు రామ్మోహన్
దేశంలో కరోనా విజృంభణకు కీలక హాట్ స్పాట్‌గా మారిన ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్లో ప్రార్థనకు హాజరైన వ్యక్తులను గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా మర్కజ్‌కు వందల సంఖ్యలో హాజరవడంతో నగర వాసులు భయం భయంగా గడుపుతున్నారు.
ఇక నగరం నుంచి మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించామని చెప్పారు. మిగతా వారు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నగరంలోని వీధి కుక్కలకు ఎంటమాలజీ విభాగం ద్వారా ఆహారం అందిస్తామని మేయర్ చెప్పారు. అలాగే, 1500 మంది యాచకులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రవాణా, వసతి కల్పిస్తున్నామని రామ్మోహన్ చెప్పారు.