Pawan Kalyan: ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధాలకు పంపడం న్యాయమా?: వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న
- ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు
- వారికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ఇవ్వడం లేదు
- వైద్య సిబ్బంది ఏం చెపుతున్నారో వినండి
కరోనా వ్యాధిగ్రస్తులకు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు. ఆయుధాలు లేకుండా సైనికులను యుద్దానికి పంపడం న్యాయమా అని లేఖలో పవన్ ప్రశ్నించారు. వైద్య సిబ్బంది ఏం చెబుతున్నారో ఓ సారి వినండని చెప్పారు.
'కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో వైద్య సిబ్బంది వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా సేవలు అందిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదు. ఇంట్లో తమ బిడ్డలను వదిలొచ్చి వారు విధులను నిర్వర్తిస్తున్నారు. తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ చిన్నారులకు, ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి ప్రమాదం అని తెలిసి కూడా వారు సేవలందిస్తున్నారు. అలాంటి వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంచకపోవడం దారుణం. ఆయుధాలను ఇవ్వకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన ఎక్విప్ మెంట్ ఇవ్వకుండా కరోనాతో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు.
కరోనాకు వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఎలాంటి గౌన్స్, గ్లోవ్స్, మాస్కులు, ఫేస్ షీల్డ్ ధరించాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించింది. దానికి తగ్గట్టుగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ ఇవ్వాలి. ఆసుపత్రుల్లో వాటిని సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎన్-95 మాస్కులు కూడా ఇవ్వడం లేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినండి.
నిర్దేశించిన విధంగా రక్షణ పరికరాలు, దుస్తులను ఇస్తేనే సిబ్బంది ధైర్యంగా విధులు నిర్వర్తించగలరు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి. ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వారి సేవలను గుర్తించాలి. వారి ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వాలి. వారిని ఆపదలోకి నెట్టకుండా రక్షణ చర్యలను చేపట్టాలని వైసీపీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా' అని పవన్ కల్యాణ్ ఆ లేఖలో కోరారు.