Corona Virus: 204 దేశాలకు పాకిన కరోనా మహమ్మారి... 50 వేల మందికి పైగా బలి
- ఇటలీలో 13 వేలు దాటిన మృతుల సంఖ్య
- అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య 2.44 లక్షల పైచిలుకుగా నమోదు
- భారత్ లో మరింత పెరుగుతున్న పాజిటివ్ కేసులు
మానవాళికి ప్రబల శత్రువుగా పరిణమించిన కరోనా మహమ్మారి ఇప్పుడు 204 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,14,256గా నమోదైంది. ఇప్పటివరకు 52,982 మంది మృతి చెందారు. ముఖ్యంగా ఇటలీలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,242 కాగా, మృతుల సంఖ్య 13,915కి పెరిగింది. స్పెయిన్ లోనూ ఇదే తరహా భయానక పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,065 కాగా, మృతిచెందిన వారి సంఖ్య 10,348.
ఇక పాజిటివ్ కేసుల విషయానికొస్తే అగ్రరాజ్యం అమెరికా ప్రథమస్థానంలో ఉంది. ఇప్పుడక్కడ 2,44,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,886 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్ లోనూ కరోనా బీభత్సం కొనసాగుతోంది. 59,105 పాజిటివ్ కేసులు నమోదవగా, 5,387 మంది మరణించారు. కరోనా వైరస్ జన్మస్థానమైన చైనాలో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81,589 కాగా, 3,318 మంది ప్రాణాలు విడిచారు.
ఇక ఇరాన్ లో 3,160, యూకేలో 2,921, నెదర్లాండ్స్ లో 1339, బెల్జియంలో 1,011, జర్మనీలో 1,107 మంది కరోనా భూతానికి బలయ్యారు. ఇటు, భారత్ లోనూ కరోనా విజృంభిస్తోంది. భారత్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 2,567కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 72 మంది మృతి చెందారు. గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.