Digvijay Singh: అజ్ఞాత ఫోన్ కాల్స్ బెడద తట్టుకోలేక ఫోన్ స్విచాఫ్ చేసుకున్న దిగ్విజయ్ సింగ్
- డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
- టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తో మాట్లాడినా ఆగని కాల్స్
- ఆ నంబర్లు తనకు పంపాలన్న మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వెల్లువలా ఫోన్ కాల్స్ వస్తుండడంతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన మొబైల్ ఫోన్ ను స్విచాఫ్ చేశారు. అజ్ఞాత ఫోన్ కాల్స్ బెడద మరీ తీవ్రం కావడంతో ఆయన మధ్యప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
గత నాలుగైదు రోజుల నుంచి అదేపనిగా వస్తున్న ఫోన్ కాల్స్ తో ఇబ్బందిగా ఉందని, దీనిపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తో మాట్లాడినా కాల్స్ మాత్రం ఆగడం లేదని దిగ్విజయ్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్ స్విచాఫ్ చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించలేదని అన్నారు. దీనిపై ఆయన ట్వీట్ చేస్తూ, ఆయా ఫోన్ నంబర్ల స్క్రీన్ షాట్లను కూడా పంచుకున్నారు. వాటిలో కొన్ని ఇంటర్నేషనల్ నంబర్లు కూడా ఉన్నాయి.
దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు రామేశ్వర్ శర్మ స్పందిస్తూ, దిగ్విజయ్ సింగ్ బాధపడాల్సిన పనిలేదని, దేశవ్యాప్తంగా సంక్షుభిత పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఫోన్ స్విచాఫ్ చేసుకోవడం ఎందుకని అన్నారు. దిగ్విజయ్ ఫోన్ కు వస్తున్న కాల్స్ ను తన ఫోన్ కు ఫార్వార్డ్ చేయాలని, తాను చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.